Q.నేను గత ఇరవై ఏళ్లుగా విదేశాల్లో ఉన్నాను. నాదీ వైవాహిక సమస్యే. నాకు, నా భార్యకు మధ్య సరయిన అనుబంధం లేదు. ఒకే ఇంట్లో ఉంటున్నా మా మనసులు ఎప్పుడో విడిపోయాయి. అసలు మొదటినుంచీ నా భార్యకు సంసారం పట్ల ఆసక్తి లేదు. నేనే రాజీపడి నెట్టుకొస్తున్నాను. మా ఇద్దరినీ కలుపుతున్న బంధం 17 సంవత్సరాల మా అబ్బాయి. కానీ ఈ మధ్య జీవితం మరీ విసుగ్గా ఉంది. ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉండాలి అనిపిస్తోంది. ఆమెకి నా అవసరం లేదు. ఏ నిర్ణయం తీసుకోకుండా జీవితమంతా ఇలా గడపాలని లేదు. ఆమె తల్లిదండ్రులతో చెప్పినా లాభం లేదు. పిరికివాడిలా జీవితం గడుపుతున్నందుకు నా మీద నాకు చాలా కోపంగా ఉంది.
-మోహన్
A.సమాజం కోసమో, పిల్లవాడి కోసమో ఇన్నాళ్లు ఓపిక పట్టారన్న మాట. సాధారణంగా ఆడవాళ్లు ఎదుర్కొనే సమస్యలు ఇక్కడ మీరు చెప్తున్నారు. మొదట్లోనే ఆమెకు ఇష్టం లేదన్నపుడు నిర్ణయం తీసుకుని ఉండాల్సింది. ఏమైనా ఇక్కడ సమస్య మీరే ప్రస్తావించారు కాబట్టి మీ కోణంలో మాత్రమే ఆలోచించగలం. నిజమే మీరు చాలా రోజులు రాజీపడ్డారు. ఇంకా అలాగే ఉండాల్సిన అవసరం లేదు. మీ అబ్బాయి కూడా పెద్దవాడయ్యాడు. బహుశా అర్థం చేసుకుంటాడు. ముందు మీరు మీ భార్యతో మాట్లాడండి. ఒక స్నేహితుడిగా మీ సమస్య చర్చించండి. ఆమెకీ పెద్ద అభ్యంతరం ఉండకపోవచ్చు. అయితే దానికి ముందు ఆర్థికంగా ఆమె పరిస్థితి గమనించాలి. మీరిద్దరూ ఒక నిర్ణయానికి వస్తే ఇతర విషయాలు పట్టించుకోనక్కర్లేదు. మిగిలిన జీవితమన్నా అర్థవంతంగా గడపాలన్న మీ ఆలోచన సబబే. మీ భార్యకూ ఇదే వర్తిస్తుంది. పరస్పర అంగీకారంతో ఒక నిర్ణయానికి వస్తే మంచిది.
-కె.శోభ,
ఫ్యామిలీ కౌన్సెలర్,
హార్ట్ టు హార్ట్,
[email protected]