తనకు బలం లేదన్న విషయం పవన్ కళ్యాణ్ కు పార్టీ పెట్టేటప్పుడే తెలుసనీ, కానీ బలం లేదు కాబట్టి పోటీ చేయలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. 2019లో బలం ఉందని పోటీ చేశారా, మరి అప్పుడు బాబుతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదని సూటిగా ప్రశ్నించారు. 2019లో చంద్రబాబుకు వ్యతిరేకత ఉండడంతో ఆ ఓట్లు చీల్చడం కోసమే విడిగా పోటీ చేశారని నాని విమర్శించారు. పవన్ కు చంద్రబాబుతో లాలూచీ ఉందని, అసలు ఆయన కోసమే పవన్ పార్టీ పెట్టారని, అందుకే రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బాబుకు ఐదేళ్లకోసారి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తన రాజకీయాన్ని మార్చడం అలవాటేనన్నారు. పవన్ తన పార్టీని టెంట్ హౌస్ లాగా, షామియానా షాపులాగా నడుపుతున్నారని ధ్వజమెత్తారు.
ఇప్పటికైనా పవన్ ను అభిమానిస్తున్నవారు… బాగా చదువుకొని, సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ, వాటికి సెలవు పెట్టి, కొందరు మానేసి పవన్ ను సిఎం చేయడం కోసం అహరహం తపిస్తున్న యువకులు ఇప్పటికైనా ఆయన నైజాన్ని గ్రహించాలని, ఎవరి ఉద్యోగాలు వారు చేసుకోవాలని సూచించారు. పవన్ ను నమ్మ్ముకోవడం మాని వారి తల్లిదండ్రుల ఆశలు నేరవేర్చేలా కృషి చేయాలన్నారు.