Wednesday, June 26, 2024
HomeTrending Newsకాంగ్రెస్ ముసుగులో చంద్రబాబు

కాంగ్రెస్ ముసుగులో చంద్రబాబు

టీడీపీ ముఖం పెట్టుకుని వస్తే తెలంగాణ ప్రజలు రానివ్వరని, తన మనుషులను కాంగ్రెస్ లోకి పంపి తెలంగాణలో చంద్రబాబు అడుగు పెడుతున్నారని అర్థీక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. చంద్రబాబే మళ్లీ  కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి వస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. నాలుగవ విడత పల్లె ప్రగతిలో భాగంగా బెజ్జంకి మండలంలో మంత్రి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

చంద్రబాబు ఆనాడు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలవాలని ప్రయత్నిస్తే ఆంద్రాబాబు అని ప్రజలు వెల్లగొట్టారు. కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు తన వాళ్లకు పదవులు ఇప్పిస్తున్నారని మంత్రి ఆరోపించారు.  రేవంత్ రెడ్డి, చంద్రబాబులు ఓటుకు నోటు కేసులో ఉన్నవాళ్లేనన్న మంత్రి చంద్రబాబుకు అత్యంత‌ సన్నిహితుడు ఇప్పుడు పీసీసీ‌ చీఫ్ గా వచ్చాడన్నారు.

టీఆర్ఎస్ జెండా ఎత్తుకున్నాక, పొలాల్లో నీళ్లు, ఇంటింటికీ తాగునీళ్లు వస్తున్నాయని మంత్రి హరీష్ తెలిపారు. 70 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ చేయని పని టీఆర్ఎస్ చేసింది. ఏ చెరువు చూసినా నీటితో నిండి ఉన్నాయి. వానలు ఇంకా  రాకముందే కాళేశ్వరం నీటితో కళకళలాడుతోంది. కాంగ్రెస్ హయాంలో పంట రుణాలు రావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి ఉండేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాలు బయట పెట్టకుండా రైతుబంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లో  జమ చేశారు. ఎకరానికి 5 వేల రూపాయలు.. విత్తనాలు, నాట్లు, నారుమడి వంటి ఖర్చు కోసం ఇస్తున్నారని వివరించారు.

ఇక బీజేపీ ఏమైనా ఇస్తోందా అన్న మంత్రి హరీష్ ఏమీ ఇవ్వకపోగా ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. డీజిల్ ధర రూ.100 చేసింది. రైతు శ్రేయస్సు కోసం ఎకరానికి టీఆర్ఎస్ 5 వేలు ఇస్తే., డీజిల్ ధర పెంచి బీజేపీ రైతుల పైసలు గుంజేసిందని ఆరోపించారు. ఏడేళ్లలో బీజేపీ దేశానికి ఏం చేసింది, పేద ప్రజల కోసం ఏం చేసింది. యేడాదిలో 25/26 రూపాయల పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. దీంతో అన్నీ ధరలు పెరిగాయన్నారు.

కరోనా కష్టకాలంలోనూ మేం రైతుల‌ నుంచి ధాన్యం కొనుగోలు చేశాం. ఒక్క గింజ లేకుండా ధాన్యం కొన్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ అని మంత్రి స్పష్టం చేశారు. 90 లక్షల మెట్రిక్ టన్నులు యాసంగిలో కొన్నాం. ఆంధ్రప్రదేశ్ లో  24 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారన్నారు. ఆనాడు ఆంధ్రా వాళ్లు వ్యవసాయం రాదని వెక్కిరించారు, ఈనాడు వాళ్లు అసూయ పడేలా తెలంగాణ రాష్ట్రం ఎదిగిందన్నారు. దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని, 2 కోట్ల 2 లక్షల మెట్రిక్ టన్నులు  పంజాబ్ పండించగా  తెలంగాణ, 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి దేశంలో నెంబర్ వన్ స్థానంలో‌ నిలిచిందన్నారు.

  దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ మారిందని మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాకముందు ఎకరం భూమి ధర  బెజ్జంకి లో4 లక్షలు ఉంటే, రైతు బంధు, కాళేశ్వరం నీరు, ఉచిత‌విద్యుత్ వంటి పథకాల‌వల్ల  ఇప్పుడు 4 లక్షల ఎకరం నుంచి 40 లక్షలకు ఎకరం చొప్పున పెరిగిందని మంత్రి పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్