Committed: కౌలు రైతుల పరామర్శ పేరిట బయల్దేరిన చంద్రబాబు దత్తపుత్రుడు…. పట్టాదార్ పాస్ బుక్ ఉండి నష్ట పరిహారం అందని ఒక్క రైతును కూడా చూపించలేకపోయారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంత గొప్పగా, పారదర్శకంగా తమ పాలన సాగుతోందని వెల్లడించారు. దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకుంటున్నామని, గత ప్రభుత్వం లాగా వారికి సాయం ఎగ్గొట్టదానికి ఎలాంటి కుంటిసాకులూ వెతుక్కోవడంలేదని స్పష్టం చేశారు. పట్టాదార్ పాస్ బుక్ ఉండి, మరణించిన ప్రతి ఒక్క కుటుంబానికీ 7 లక్షల రూపాయలు అందిస్తున్న ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు.
ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో జరిగిన ‘వైఎస్సార్ రైతు భరోసా – పిఎం కిసాన్’ కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. ఈ పథకం కింద నాలుగో ఏడాది తొలి విడత నిధులను రైతుల అకౌంట్లలో జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో అయన జగన్ ప్రసంగించారు. గ్రామంలో తాము ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల్లో క్రాప్ కల్టివేటర్స్ రైట్స్ కార్డ్స్ (CCRC) కింద నమోదు చేసుకున్న కౌలు రైతులకు కూడా ఈ నష్ట పరిహారం అందిస్తున్నామన్నారు.
ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసే లోగానే పరిహారాన్ని అందించడం భారత దేశ చరిత్రలోనే మొదటిసారి మన రాష్ట్రంలోనే జరుగుతోందన్నారు. రైతు భీమాలో రైతుల వాటాగా చెల్లించాల్సిన సొమ్మును కూడా ప్రభుత్వమే చెల్లిస్తోందని గుర్తు చేశారు. ‘రైతులకు ఇలాంటి మేలు చేయాలంటే…. నేలతల్లి మీద, వ్యవసాయం మీద, మన గ్రామం మీద, మన సంస్కృతి మీద, మన రైతు కూలీల మీద, రైతుల కష్టం మీద….. మమకారం ఉండాలి, అవగాహన ఉండాలి, గత పాలకులకు ఇవేవీ కూడా లేవని ప్రజలు గమనించాలి’ అని ప్రజలకు సిఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ‘ఎన్నికల్లో రైతుకు ఒక మాట ఇచ్చి ఆ మాట తప్పితే రైతు ఏమవుతాడో అన్నది అర్ధం కాని ఏ నాయకుడైనా రాజకీయాల్లో ఉండడానికి తగునా ‘అని చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. గతంలో రైతు రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి… అధికారంలోకి వచ్చిన తరువాత నిబంధనలు పెట్టి కేవలం లక్ష రూపాయలే మాఫీ చేస్తానని… దానిలో కూడా సగం మాత్రమే చేసిన గత పాలకుడి వైనాన్ని గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. ఇదే దత్తపుత్రుడు నాడు రుణమాఫీపై ఎందుకు ప్రశ్నించలేదని సిఎం నిలదీశారు.
రైతులకు గత ప్రభుత్వం ఏమి చేసిందో, తాము ఏమి చేస్తున్నామో గమనించి… గతానికి, ఇప్పటికీ తేడా పోల్చుకోవాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వర రావు, మాజీ మంత్రులు ఆళ్ళ నాని, శ్రీరంగానాథ రాజు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Also Read : నేడు రైతు భరోసా నాలుగో ఏడాది తొలి విడత