ఆంధ్రప్రదేశ్ లో తొలి ఓమిక్రాన్ కేసు నమోదైంది. ఐర్లాండ్ నుంచి వచ్చిన విజయనగరం జిల్లా వాసికి ముంబై ఎయిర్ పోర్ట్ లో కోవిడ్ పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. విశాఖ విమానాశ్రయంలో మరోసారి ఆర్టీ పీసీఆర్ టెస్టులు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. అతని నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కు పంపించగా ఓమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలియజేశారు.
విదేశాల నుంచి వచ్చిన వారిలో మొత్తం 15 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని, వీరి శాంపిల్స్ ను జినోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల కోసం హైదరాబాద్ సిసిఎంబీ కి పంపామని, వీరిలో 10 మందికి సంబంధించిన ఫలితాలు రాగా ఒక్కరికి ఓమిక్రాన్ నిర్ధారణ అయ్యిందని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఓమిక్రాన్ సంక్రమించిన వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు. ఇతనికి నిన్న(డిసెంబర్ 11, శనివారం) మరోసారి కోవిడ్ పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చిందన్నారు.
ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, అసత్య వార్తలను, పుకార్లను నమ్మవద్దని అయన సూచించారు. మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని అయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.