Saturday, January 18, 2025
HomeTrending Newsశ్రీరాంసాగర్ కు పోటెత్తిన వరద

శ్రీరాంసాగర్ కు పోటెత్తిన వరద

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లా లోని శ్రీరాంసాగర్ జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. గోదావరి రాష్ట్రంలోకి ప్రవేశించాక మొదటి రిజర్వాయర్ ఇది. సోమవారం ఉదయానికి 97 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఇది రోజుకు 8 టిఎంసీలతో సమానం. 90 టిఎంసీల పూర్తి సామర్థ్యం ఉన్న శ్రీరాం సాగర్ లో ప్రస్తుతం 46 టిఎంసీల స్టోరేజి ఉంది. సాధారణంగా ఆగస్టులో వరద వచ్చే ఈ జలాశయం జులై రెండో వారంలోనే వరద నీటితో కళకళలాడుతోంది. మరో పక్క గోదావరి ఉపనది మంజీరపై ఉన్న సింగూరు రిజర్వాయర్ కు కూడా 2600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. సింగూరు గరిష్ఠ సామర్థ్యం 30 టిఎంసీలు కాగా మరో 11 టిఎంసీల నీరు చేరితే పూర్తిగా నిండుతుంది.

రాజమండ్రి వద్ద ధవళేశ్వరం బ్యారేజికి 42 వేల క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. కాలువలకు పోను 30 వేల క్యూసెక్కులు వృథాగా సముద్రంలోకి వెళ్తున్నాయి.

పెన్నానదిపై నెల్లూరులో ఉన్న సోమశిల రిజర్వాయర్ కు ఐదు వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. 78 టిఎంసీల ఈ జలాశయం నీటి నిల్వ 47 టిఎంసీలకు చేరింది. అరుదుగా ఉప్పొంగే పెన్నా గత నెల రోజులుగా కొత్త నీటితో ఉరకలు పెడుతోంది.

పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణాకు వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 130 టిఎంసీల ఆల్మట్టి డ్యాంలో స్టోరేజి 94 టిఎంసీలుగా ఉంది. ఎగువ నుంచి 6100 క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 10,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పై నుంచి భారీ వరద వస్తుందన్న సమాచారం ఉన్నప్పుడు రిజర్వాయర్ ను ఇలా ఖాళీ చేయడం జరుగుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్