Palle Pragathi : నాలుగు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి సాధించిన ఫలితాలు ఇప్పుడు ప్రజల అనుభవంలోకి వస్తున్నాయని, తత్ఫలితంగా రాష్ట్రంలోని అనేక గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, ఇదే వరుసలో ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. పాలకుర్తి మండల సర్వసభ్య సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత స్థానిక ప్రజా ప్రతినిధులయిన ఎంపీపీ, జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ లు ఉప సర్పంచులు వార్డ్ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ లు అందరిపైనా ఉందని మంత్రి అన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతూ పల్లె ప్రగతి ని సక్సెస్ చేయాలని మంత్రి స్థానిక ప్రజాప్రతినిధులకు బోధించారు.
అలాగే విద్య, వైద్య రంగాలకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా మన ఊరు మన బడి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, 7,280 కోట్లతో నిర్వహిస్తున్న మన ఊరు మన బడి ని కూడా విజయవంతం చేయాలన్నారు. మూడు విడతలుగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్నారు. ఇందులో గ్రామాల ప్రజలు, పూర్వ విద్యార్థులు, ఎన్నారైలు, స్వచ్ఛంద సేవా సంస్థలు అందరికీ భాగస్వాములను చేస్తూ బడుల రూపురేఖలను మార్చి, ధనికుల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విధంగా అభివృద్ధి పరచాలని సూచించారు.
వైద్య రంగం పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తున్నదని మంత్రి చెప్పారు, ఇందులో భాగంగా జనగామకు మెడికల్ కాలేజీని కూడా ఇచ్చిందన్నారు, ప్రతి ప్రభుత్వ వైద్యశాలలో అన్ని సదుపాయాలు కల్పిస్తూ 24 గంటల పాటు ప్రజలకు వైద్యం అందించే విధంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి చెప్పారు.
స్థానికంగా మిషన్ భగీరథ ద్వారా అందుతున్న మంచినీరు, ఇతర సదుపాయాలు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఎప్పటికి అప్పుడు అంద చేయడంలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని మంత్రి సూచించారు.
Also Read : ప్రభుత్వాసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు – మంత్రి హరీష్