Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకాలంతోపాటు మారాల్సిందే!

కాలంతోపాటు మారాల్సిందే!

Must Change: 
చాలా కాలంగా సోషల్ మీడియాలో ఒక జోక్ సర్క్యులేషన్ లో వుంది.
ఏ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినా అది మళ్ళీ తెరపైకొస్తుంది.
సోనియా గాంధీ తన రాజీనామాను సోనియాగాంధీకి ఇస్తే, సోనియా గాంధీ దాన్ని తిరస్కరించారట.
ఈ జోక్ ఎంత ఫన్నీగా వుందో కానీ, ప్రతి ఎన్నికల తర్వాతా కాంగ్రెస్ ప్రక్షాళన ప్రహసనం కూడా అంతే ఫన్నీ వ్యవహారం.
సోనియా గాంధీ కుటుంబం తప్పుకోవాలనుకునేవాళ్లు కొందరు.
కాదు, గాంధీ కుటుంబమే కాంగ్రెస్ కి బలం అని వాదించే వాళ్లు ఇంకొందరు.
సీనియర్లని తప్పించాలని ఒక డిమాండ్..
సీనియర్లని సరిగా వాడకపోవడం వల్లే సరైన ఎన్నికల వ్యూహాలుండట్లేదని మరో వాదన.
కొత్త తరానికి అవకాశం ఇవ్వాలనే ఒక పాతడిమాండ్ ఎప్పుడూ వుండేదే..
ఇంతకీ కాంగ్రెస్ పార్టీ సమస్యేంటి?

తరం మారింది..
ఇండియన్ల తరం మరింది.
వోటర్ల తరం మారింది.
ఆశలు మారాయి.
ఆకాంక్షలు మారాయి.
విలువలు మారాయి.
కలలు మారాయి.
కానీ కాంగ్రెస్ మారలేదు.
ఇప్పుడున్న తరానికి త్యాగం ఏమంత గొప్ప విలువ కాదు.
అధికారం ఆశించకపోవడం అసమర్థత అనుకునే తరమిది.
ఇప్పుడున్న తరానికి స్వేచ్ఛ లేకపోవడం అంటే ఏంటో తెలియదు.
స్వేచ్ఛకంటే నిర్బంధమే గొప్ప విలువ అనుకునే తరమిది.
దేశనేతగా ఒక మంచి నియంత వుండాలని కోరకునే తరమిది.


యూనివర్శిటీల కంటే వాట్సప్ యూనివర్శిటీల నుంచి ఎక్కువ నేర్చుకుంటున్న తరమిది.
చరిత్రని పాఠాల్లో కంటే, ట్విటర్లలో ఎక్కువ చదువుకుంటున్న తరమిది.
సామరస్యం కంటే, ఉద్రేకంలో ఉద్వేగాన్ని వెదుక్కునే తరమిది.
శాంతిని సాధించే వాడి కంటే, యుద్ధాన్ని కోరుకునే వాడే హీరో అనుకునే తరమిది.
దేశాన్ని ప్రేమించడం కంటే, దేశంమీద ఓనరషిప్ ని ఎక్కువ గా ప్రేమించే తరమిది.
భారతీయత మొత్తాన్ని ఒక్క మతంలో కుదించుకున్న తరమిది.
నిన్నటి వేదంలో రేపటి సైన్స్ వెదుక్కునే జనరేషన్ ఇది.
రోజుకి ఇరవైగంటలు ఆన్ లైన్ లో గడిపే తరమిది.


ఈ జనరేషన్ భాష వేరు.
ఈ తరం వ్యాపకం వేరు.
మంచి, చెడులని పక్కన పెడితే, మెజారిటీ వోటర్ల మనస్తత్వమిదే.
సగటు భారతీయుడి సైకాలజీ ఇదే
వరస ఎన్నికలఫలితాలే దీనికి సాక్ష్యం.
గుజరాతీయులు సగటు భారతీయుడి కంటే ఒకడుగు ముందే వుంటారని చెప్పుకుంటారు.
అందుకే ఈ తరహా మనస్తత్వం గుజరాత్ లో ఒక పదిహేనేళ్ళ క్రితమే మొదలైంది.

కాంగ్రెస్ లో సమస్యల్లా ఈ కొత్త మనస్తత్వాన్ని అర్థం చేసుకోకపోవడం.
ఈ కొత్త వోటరు నాడిని పట్టుకోలేకపోవడం
ఈ కొత్త తరానికి కనెక్ట్ అయ్యే నేతలు లేకపోవడం..
కొత్త భాష మాట్లాడకపోవడం..
ఈ అవలక్షణాలన్నిటకీ కాంగ్రెస్ పార్టీ కూడా వత్తాసు పలకాలని కాదు.
దేన్ని మార్చాలో.. ముందు దాన్ని అర్థం చేసుకోవడం అవసరం.
మార్చడానికి అవసరమైన సరంజామా సమకూర్చుకోవడం అవపరం.
కాంగ్రెస్ లో ఇవేమీ జరుగుతున్నట్టు అనిపించదు.

Congress Party
ఇంకా తాతల త్యాగాల మీదే అధికారం పునాదులు కడతామంటే కుదరదు.
ఇంకా ఫేస్ బుక్, ట్విటర్ల మీద యుద్ధాలు చేస్తామంటే అయ్యేపనికాదు.
అప్పుడప్పుడూ వంటికి విభూది పూసుకుని, గుళ్ళ చుట్టూ ప్రదిక్షణలు చేస్తే సరిపోదు.
ఈ తరానికి అర్ధమయ్యే భాషేదో కనుక్కోవాలి.
ఈ తరంతో కనెక్ట్ అయ్యే లాజిక్ ఏదో పట్టుకోవాలి.
ఈ కొత్త భాష, కొత్త లాజిక్, కొత్త అధ్యయనం, కొత్త అప్రోచ్..
ఇవీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కావల్సినవి.
ఆ పని రాహూల్ అయినా చెయ్యొచ్చు.
ప్రియాంక అయినా చెయ్యొచ్చు.
ఇంకెవరైనా చేయొచ్చు.
నేతల కంటే, చేతలు ముఖ్యం.
అసలు చేయాల్సినదేంటో క్లారిటీలేకుండా. కేవలం విగ్రహాలని మార్చినంత మాత్రాన ప్రయోజనం ఏమీ ఉండదు .
-శివప్రసాద్

ఇవి కూడా చదవండి: అవగాహన లేమి పెద్ద అవరోధం

RELATED ARTICLES

Most Popular

న్యూస్