పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో వరుస రీమేకులు చేస్తూ వెళుతున్నారు. అలా ఆయన చేసిన మరో రీమేక్ ‘బ్రో’. నటుడిగా … దర్శకుడిగా తమిళంలో సముద్రఖని చేసిన ‘వినోదయా సితం’కి ఇది రీమేక్. అక్కడ ఆ సినిమాను తెరకెక్కించిన సముద్రఖనియే ఇక్కడ ఈ సినిమాకి దర్శకుడు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదులోని ‘శిల్పకళావేదిక’లో నిన్న రాత్రి నిర్వహించారు.
ఈ స్టేజ్ పై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ .. నన్ను హీరోను చేయాలని మా అన్నయ్యకి ఉండేది. నన్ను ఆ మాట అడిగినప్పుడు నేను షాక్ అయ్యాను. ఎందుకంటే నాకు తెలిసిన హీరో అన్నయ్యనే. ఆయన ఎంతో కష్టపడి పైకి వచ్చారు. నేను హీరోనైతే అంతకంటే ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. నాకేమో హీరోను కావాలనే కోరిక పెద్దగా ఉండేది కాదు. హీరోగా నువ్వు చేయగలవు అంటూ ఆ సమయంలో మా వదినగారు నన్ను ప్రోత్సహించింది. మొదటిసారిగా ఒక సినిమా కోసం బస్సుపై డాన్స్ చేయవలసి వచ్చినప్పుడు, మా వదిన నాకు ఎంత ద్రోహం చేసిందనేది అర్థమైంది” అంటూ నవ్వేశారు.
అలా హీరోగా నా ప్రస్థానం కొనసాగుతూ వచ్చింది. ‘బ్రో’ సినిమా కథను సముద్రఖని నాకు చెప్పినప్పుడు, సాయితేజ్ కి జరిగిన ప్రమాదం గుర్తుకు వచ్చింది. అతని లైఫ్ లో జరిగిన సంఘటనకి ఈ సినిమా లైన్ చాలా దగ్గరగా అనిపించింది. సముద్రఖనికి తమిళ సాహిత్యంపై మంచి పట్టు ఉంది. అందువల్లనే ఆయన ఈ పాయింటును రెడీ చేసుకోగలిగారు. ఇక్కడికి వచ్చిన తరువాత ఆయన తెలుగు కూడా నేర్చుకున్నారు. ఒక రకంగా నాకు ఆయన కనువిప్పు కలిగించారు. నేను కూడా తమిళం నేర్చుకుని, ఆ భాషలో మాట్లాడతాను” అంటూ సముద్రఖనిపై ప్రశంసలు కురిపించారు.