Sunday, January 19, 2025
HomeTrending Newsమంచిర్యాల జిల్లాలో అటవీ భూముల వివాదం

మంచిర్యాల జిల్లాలో అటవీ భూముల వివాదం

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో కోయపోచగూడ అనే గ్రామం ఉంది. ఈ గ్రామం కవ్వాల్ పులల అభయారణ్యం సరిహద్దుకు ఆనుకుని ఉంది. దట్టమైన ఈ అటవీ ప్రాంతంలో అంతకు ముందు ఎలాంటి ఆక్రమణలు, పోడు వ్యవసాయం లేదు. ఇటీవల కోయపోచగూడకు చెందిన గ్రామస్థులు కొందరు లింగాపూర్ బీట్ లో సుమారు 25 ఎకరాల్లో చెట్లను నరకటం, అటవీ భూమిని చదును చేయటం మొదలు పెట్టారు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక అటవీ అధికారులు వెంటనే వారించారు.

అడవుల్లోకి ప్రవేశించి, చెట్లు కొట్టివేయటం, చదును చేయటం చట్ట రీత్యా నేరమని అడ్డుకున్నారు. అటవీ, రెవన్యూ, పోలీసు ఉమ్మడి అధికారుల బృందం పలుమార్లు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా అడవిని చదును చేయటం కొనసాగిస్తుండటంతో.. నిబంధనల ప్రకారం అటవీ అధికారులు వారిపై కేసులు పెట్టడంతో అరెస్ట్ కావటంతో పాటు, ఆ తర్వాత బెయిల్ పై విడుదల అయ్యారు. మొత్తం ఈ విషయానికి సంబంధించి అటవీ శాఖ అధికారులు, సిబ్బంది నిబంధనల మేరకు నడుచుకున్నారని కవ్వాల్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ సీ.పీ. వినోద్ కుమార్ తెలిపారు.

కోయపోచగూడ పక్కనే ఉన్న కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలోకి గ్రామస్థులు చొరబడి, కొత్తగా పోడు కోసం అడవిని చదును చేయటంతోనే సమస్య మొదలైందని ఆయన తెలిపారు. అక్కడ గతంలో ఎలాంటి పోడు వ్యవసాయం లేదని, తాజాగా ఆడవి ఆక్రమించే ప్రయత్నాలనే తమ సిబ్బంది నివారించారని వినోద్ కుమార్ తెలిపారు. గతంలో ఎలాంటి చొరబాటు లేని, అటవీ భూమిని కొత్తగా ఆక్రమించాలనే దురుద్దేశ్యంతో కొందరు, స్థానిక మహిళలను ముందు పెట్టి సమస్య సృష్టించారని ఫీల్డ్ డైరెక్టర్ తెలిపారు. అటవీ చట్టాలను ఉల్లంఘించి, ఆక్రమించేవారిపై, వాళ్ల వెనుక ఉన్నవారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయిని ఆయన వివరించారు.

ఈ వివాదాన్ని అడ్డుపెట్టుకుని కొందరు రాజకీయాలు చేస్తున్నారని, ప్రభుత్వ చర్యలను తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అడవుల ప్రాధాన్యతను, పర్యావరణ ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని స్థానికులు తమకు సహకరించాలని కోరారు. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలను హైదరాబాద్ లో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పీసీసీఎఫ్ ఆర్.ఎం. డోబ్రియాల్ ను కలిసి వినోద్ కుమార్ వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్