Saturday, November 23, 2024
HomeTrending NewsPerni Nani: లోపాలు సరిదిద్దడం తప్పు కాదు : నాని

Perni Nani: లోపాలు సరిదిద్దడం తప్పు కాదు : నాని

మాజీ మంత్రి  పేర్ని నాని నేడు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డిని  కలుసుకున్నారు. నిన్న జరిగిన ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఏలూరు కలెక్టర్ రాకపోవడంపై ఫిర్యాదు చేశారు. తర్వాతి సమావేశానికి ఏలూరు కలెక్టర్ రాకపోతే సిఎం ఇంటి వద్ద ధర్నా చేస్తానని నిన్న ప్రకటించిన  పేర్ని తన వ్యాఖ్యలు వివాదం కావడంతో వాటిపై వివరణ ఇచ్చారు.

2019 ఎన్నికల్లో జిల్లాల విభజన చేస్తామంటూ ఇచ్చిన హామీ మేరకు సిఎం జగన్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని, కానీ అప్పటికి  స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోవడంతో జెడ్పీ సర్వ సభ్య సమావేశాలు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన జరుగుతున్నాయని నాని చెప్పారు.  రాష్ట్రానికి  సంబంధించి సీఎంకు సర్వాధికారాలు ఎలా ఉంటాయో జిల్లాల్లో కలెక్టర్లకి అలాగే ఉంటాయని,  ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి రెండు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో కలిపారని,  కానీ ఏలూరు జిల్లా నుంచి వ్యవసాయ జెడీఈ తప్ప జిల్లా స్థాయి హోదా ఉన్న అధికారులెవ్వరూ రాలేదని నాని అసహనం వ్యక్తం చేశారు.

ఏలూరు జిల్లా నుంచి చిన్న అధికారులను గుమస్లతాలను పంపారని,. ఇలాగైతే ప్రజల సమస్యల పరిష్కారం అయ్యేది ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే సమావేశాలకు ఏలూరు కలెక్టర్ రాకుంటే సీఎం జగన్ వద్ద కూర్చొంటానన్న మాట నుంచి వెనక్కు వెళ్లడం లేదని స్పష్టం చేశారు. తానేదో ప్రభుత్వాన్ని, జగన్ ను విమర్శించానని కొందరు అంటున్నారని, కానీ  రాష్ట్ర పెద్దగా, సిఎంగా ఉన్న జగన్ కు కాకుండా సమస్యలు మరెవరికి  చెబుతామని నాని ప్రశ్నించారు. ఈ విషయంలో  తాను ప్రెస్టేజీకి పోవడం లేదని,  ఆరు నెలల్లో రిటైర్డ్ అయ్యేవాడిని నాకేం ప్రెస్టేజ్ ఉంటుందని అన్నారు.

అధికార పార్టీలో ఉన్నా వ్యవస్థల్లో లోపాలు సరిదిద్దే ప్రయత్నం చేస్తే తప్పెలా అవుతుందని,  నిన్ననే ఏలూరు కలెక్టర్ ప్రసన్న  వెంకటేష్ తో మాట్లాడానని,  వ్యవస్థలకు భంగం కలగకూడదనే  తాను మాట్మాలాడానని, ఆయితే  జెడ్పీ సమావేశానికి హాజరు కావడం మాండేటరీ కాదు అని ఆయన తనతో చెప్పారని….  అదే కరెక్ట్ అయితే సరి చేయమని చెప్పడానికే తాను నేడు సిఎస్ ను కలిశానని చెప్పారు.  కలెక్టర్లు జెడ్పీ సమావేశాలకు రావాలని సీఎస్ స్పష్టం చేశారని, దీనిపై  అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిస్తామని సీఎస్ హామీ ఇచ్చారని తెలిపారు.

అధికార పార్టీలో ఉంటే సమస్యలు ప్రస్తావించకూడదని లేదని, ప్రతిపక్షం నిద్రపోతే ఏం చేయాలంటూ తనదైన శైలిలో నాని జవాబిచ్చారు.  సీఎం దగ్గరకు కాకుండా ఎవరి వద్దకెళ్లాలని,  చంద్రబాబు దగ్గరకో… హు.. హ అనే వ్యక్తి దగ్గరకో వెళ్లాలా? అని వ్యంగ్యంగా అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్