Sunday, November 24, 2024
HomeTrending Newsఅమరావతి యాత్ర ఆగినట్టే: బొత్స

అమరావతి యాత్ర ఆగినట్టే: బొత్స

ఆంధ్ర ప్రదేశ్ పరిపాలనా రాజధానిగా విశాఖ ఉండాలన్న ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష సాకారం అయినట్టేనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. పరిపాలనా రాజధానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని.. వాటిని త్వరలోనే  పరిష్కరించుకొని విశాఖకు రాజధాని తరలించే ప్రక్రియ మొదలు పెడతామని చెప్పారు. అమరావతి రైతులు అరసవిల్లి వరకూ చేపట్టిన మహా పాదయాత్ర ఆగిపోయినట్లుగా భావిస్తున్నానని అన్నారు.  విజయనగరం కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని భీమసింగి, సీతానగరం చక్కెర కర్మాగారాల పరిధిలో ఈ సీజన్‌లో రైతులు పండించిన చెరకును క్రషింగ్‌ కోసం శ్రీకాకుళం జిల్లాలోని చక్కెర కర్మాగారాలకు తరలింపు, రైతులకు చెల్లించే ధరపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా బొత్స మీడియాతో మాట్లాడారు.

జిల్లాలో నిర్మిస్తోన్న భోగాపురం గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయం, గిరిజన విశ్వవిద్యాలయానికి ప్రధానమంత్రి చేతుల మీదుగా వచ్చే నెలలో శంకుస్థాపన చేయబోతున్నామని వెల్లడించారు. దీనిపై కొన్ని కోర్టు వివాదాలు ఉన్నాయని, అవి త్వరలోనే పరిష్కారమవుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

పాదయాత్రలో ఎంతమంది పాల్గొంటున్నారనే విషయమై కోర్టు ఆధారాలు అడిగిందని, పాదయాత్రలో 600 మందికి కోర్టు అనుమతిస్తే దానిలో 60మంది కూడా రైతులు లేరన్నారు.  వివరాలు అడిగే సరికి దేపా ముసుగులో ఉన్న అమరావతి రైతులు పాదయాత్రను ఆపేశారని ఎద్దేవా చేశారు. ‘రైతుల పాదయాత్ర ఆగిపోయినట్టుగా భావిస్తున్నా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. విశాఖ రాజధాని సాధనపై త్వరలో రూట్‌ మ్యాప్‌ నిర్ణయిస్తాం’ అని బొత్స తెలిపారు.

Also Read : 2023కి భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తి : మేకపాటి

RELATED ARTICLES

Most Popular

న్యూస్