Saturday, January 18, 2025
HomeTrending Newsపదవుల పంపకంలో సామాజిక న్యాయం: సజ్జల

పదవుల పంపకంలో సామాజిక న్యాయం: సజ్జల

ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో సిఎం జగన్ సామాజిక న్యాయాన్ని పాటించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్సీలే కాకుండా బిసి కార్పోరేషన్లు, రాజ్యసభ అభ్యర్ధులు ఇలా ప్రతి అంశంలో అన్నివర్గాలకూ న్యాయం జరిగేలా, నిబద్ధతతో జగన్ పదవులు కేటాయిస్తున్నారని చెప్పారు.

భవిష్యత్ లో కూడా ఇదే విధంగా పదవులు ఇచ్చేందుకు కృత నిశ్చయంతో జగన్ ఉన్నారని సజ్జల వివరించారు. ఎమ్మెల్సీ పదవుల పంపకంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. తమ పార్టీ నుంచి శాసన మండలికి ఎన్నికైన మొదటి సభ్యుడు కూడా బిసి కులానికే చెందిన వారు ఆదిరెడ్డి అప్పారావు అని, అయితే అయన ఆ తర్వాత పార్టీ మారారని సజ్జల గుర్తు చేశారు.

శాసనమండలి రద్దు తీర్మానం వెనక్కు తీసుకోవడం లేదని సజ్జల స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వ బిల్లులను అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్షం మండలిలో చిల్లర ఎత్తుగడలు ప్రదర్శించిందని సజ్జల ఆరోపించారు. మండలిలో తమ పార్టీ మెజార్టీ సాధించడం పట్ల అయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తాము చేయాలనుకున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు, బిల్లులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పారు.

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించిన మోషేన్ రాజు, తోట త్రిమూర్తులు, లెల్ల అప్పిరెడ్డి, ఆర్వీ రమేష్ యాదవ్ లు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రోటెం చైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సజ్జలతో పాటు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్