ఇండియన్ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ హీరోలుగా నటించిన చిత్రం ‘ఫ్రెండ్ షిప్’. జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున సినిమా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
తెలుగులో శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత ఎ.ఎన్ బాలాజీ విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను హర్భజన్ సింగ్ విడుదల చేయగా.. కింగ్ నాగార్జున, హర్భజన్ సింగ్‌ను సిల్వర్ స్క్రీన్ పై చూడటం ఆనందంగా ఉందని, సినిమా పెద్ద సక్సెస్ కావాలని చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ‘ఫ్రెండ్ షిప్’ మూవీ ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకోవాలంటే.. ట్రైలర్‌ను ఓ లుక్కేయాల్సిందే.
“ఏరా ఒకడు స్మాల్, ఒకడు మీడియం, ఒకడు లార్జ్.. నువ్వే రకమో తెలియడం లేదు కదరా!” అని ఓ స్టూడెంట్ చెప్పడంతో ట్రైలర్ ప్రారంభమైంది. హర్భజన్ సింగ్ ఎంట్రీ మాస్‌గా ఉంది. హీరో హర్భజన్, కమెడియన్ సతీశ్, హీరోయిన్ లపై కొన్ని కాలేజీ సన్నివేశాలు, పాటలతో కలర్‌ఫుల్ సన్నివేశాలున్నాయి.
ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని ఉండటం, విశ్వగా నటించిన హర్భజన్ సింగ్ ఫోన్ లొకేషన్ మ్యాచ్ కావడంతో పోలీసులు హర్భజన్ సహా కాలేజీ స్టూడెంట్స్ ను అరెస్ట్ చేయడం, గొడవలు…వీటితో సినిమా కాన్సెప్ట్ ఎలా ఉండబోతుందనే విషయాలను ట్రైలర్‌లో టూకీగా చెప్పే ప్రయత్నం చేశారు.
ఇక సినిమాలో నటించిన మరో హీరో అర్జున్ లుక్ చాలా డిఫరెంట్‌గా..యాక్షన్ ఎలిమెంట్స్ మిక్సింగ్‌తో కనిపిస్తోంది. అమ్మాయిలను ఏనుగు, అబ్బాయిలను మావటి వాడితో పోల్చి.. తల్లిదండ్రులు పిల్లల పెంపకాన్ని ప్రశ్నిస్తున్నారు. ఒక వైపు అమ్మాయిల గొప్పతనాన్ని చెబుతూనే అమ్మాయిల రక్షణ బాధ్యత సమాజానిదే అనే ఓ మెసేజ్‌ను ఇవ్వడం కొసమెరుపు
ఈ సందర్భంగా శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ.ఎన్ బాలాజీ మాట్లాడుతూ “తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిన ‘ఫ్రెండ్ షిప్’ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. నేటి సమాజంలో అమ్మాయిలను ఎలా చూస్తున్నారు. వారికెలా గౌరవమివ్వాలి అనే అంశాన్ని కాలేజీ నేపథ్యంలో తెరకెక్కించారు మా డైరెక్టర్స్ జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య. సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దాదాపు పాతిక కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా తప్పకుండా వైవిధ్యంగా ఉంటుంది. రాజకీయాలకు, కాలేజ్ స్టూడెంట్స్ మధ్య ఏం జరిగిందనే విషయాన్ని ఆసక్తికరంగా, కమర్షియల్ అంశాలతో ఎంగేజింగ్‌గా ఉంటుంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేస్తాం” అన్నారు.