Gadapa Gadapaku Success: గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్ళకు కూడా తాము వెళతామని వారి ఇంటిలో లబ్ధిదారులకు ప్రభుత్వం అందించిన సంక్షేమం ఏమిటో చెబుతామని ప్రభుత చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని చోట్ల కావాలనే టిడిపి కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారని, సామాన్య ప్రజలు తమను స్వాగతిస్తున్నారని చెప్పారు. టిడిపి వారు హేళన చేసినా తాము భరిస్తామని, కానీ వారికి చేసిన మంచి ఏమిటో చెబుతామని వివరించారు. మూడేళ్ళుగా తాము ఏమి చేశామో చెప్పుకునే ధైర్యం తమకుందని, మీ ఐదేళ్ళలో ఏం చేశారో చెప్పుకునే ధైర్యం మీకుందా అని టిడిపి నేతలను సూటిగా నిలదీశారు.
రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోవడానికి టిడిపి, నారా లోకేష్ కారణమని, 12 కేసులుంటేనే తన వద్దకు రావాలని లోకేష్ చెప్పినందులే ఆ పార్టీ కార్యకర్తలు పెట్రేగి పోతున్నారని, నిందితులపై చర్యలు తీసుకుంటే మాత్రం కక్ష సాధింపు అంటున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. లోకేష్ అలా మాట్లాడడం అస్థిరత సృష్టించడం కాదా అని ప్రశ్నించారు.
నారాయణ విద్యా సంస్థల్లో పదో తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరిగిందని నిర్ధారణ అయి చర్యలు తీసుకుంటే దాన్ని కూడా టిడిపి నేతలు విమర్శించడం దారుణమన్నారు. నారాయణ విద్యా సంస్థలు నారాయణవి కావు, సుజనా చౌదరి వ్యాపార సంస్థలతో సుజనాకు సంబంధం లేదని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. క్రిమినల్ పనులు చేసినవారిని వెనకేసుకు రావడం దారుణమన్నారు. కేసులను ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి పొందడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. బాబు సిఎంగా ఉన్నప్పుడు తమ పార్టీ కార్యకర్తలు ఏమి చేసినా వదిలిపెట్టాలని స్వయంగా అధికారులకు చెప్పారని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తాము ఎం చేసినా చూసీ చూడనట్లు వదిలేయాని వారు అంటున్నట్లు ఉందన్నారు. ఇప్పటికైనా తమ ధోరణి మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. గడప గడపకు ప్రభుత్వం ఓ అద్భుతమైన కార్యక్రమమని, రాష్ట్రవ్యాప్తంగా ఓ పండుగగా సాగుతోందని, లబ్ధిదారుల కళ్ళలో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.
Also Read : పాలన గ్రామ స్థాయికి, సంక్షేమం గడప స్థాయికి