Circus – Life: జెమిని సర్కస్ వ్యవస్థాపకుడు శంకరన్ నిండు నూరేళ్లూ బతికి…పోయాడు. జెమిని సర్కస్ చరిత్ర రాస్తే రామాయణమంత రాయవచ్చు. చెబితే మహాభారతమంత చెప్పవచ్చు.
గుర్రం గుర్రం పని; గాడిద గాడిద పని చేసే కాలంలో కాబట్టి శంకరన్ సర్కస్ ఫీట్లు చెల్లుబాటయ్యాయి. ఇప్పుడు ప్రతి అడ్డ గాడిద తనను తాను సింహమనే అనుకోవడంతో…గుర్రాల మనోభావాలు తీవ్రంగా దెబ్బ తిని…కళ్లకు గంతలు కట్టుకుని…గుంతల్లో పడి…లేచి పరుగెత్తలేకుండా ఉన్నాయి. ప్రతి కుక్కకు ఒకరోజు వస్తుందని మనం అతిగా ప్రచారం చేయడం వల్ల అడవిలో మిగతా జంతువులకు ఎప్పటికీ ఒకరోజు రాకుండా పోయింది. దాంతో అవన్నీ అలిగి ఏనాటికీ రాని రోజు కోసం ఎందుకు నిరీక్షించాలి? అన్న దిగులుతో కొమ్మ దిగకుండా పైనే ఉండిపోయాయి.
మనం మనిషి పలుకులు పలికిన రోజుల్లో కాబట్టి…జెమినీ సర్కస్ శంకరన్ చిలుకల చేత చిలుక పలుకులు పలికించగలిగాడు. మనం ఇంగ్లీషు చిలుక పలుకులు మొదలుపెట్టగానే…జెమినీ చిలుకల నోట మాట రాక మూగబోయాయి.
అరణ్యంలో మాత్రమే పులులు ఉండి, జనారణ్యంలో మనుషులున్న రోజులు కాబట్టి…జెమినీ శంకరన్ బోనులో పులిని తెచ్చి సర్కస్ స్టూల్ మీద రెండు కాళ్ల మీద నిలుచోబెడితే…లోకం నోరెళ్లబెట్టి చూసింది. ఇప్పుడు ఊళ్లల్లో వీధికొక మేకవన్నె పులులున్నాయి. ఈ మేకవన్నె పులులు లోకాన్నే సర్కస్ స్టూల్ మీద ఒంటి కాలిమీద నిలుచోబెడితే సృష్టికర్త బ్రహ్మ నోరెళ్లబెట్టి చోద్యం చూస్తున్నాడు.
బతుకు నిత్య యుద్ధమై అలసి సొలసిన రోజులు కాబట్టి…జెమినీ శంకరన్ సర్కస్ గుడారం వేస్తే…ఆటవిడుపుకు, ఉపశమనానికి, ఆశ్చర్యపోవడానికి అప్పుడు లోకం వెళ్లి చూసింది. ఇప్పుడు ఎవరింట్లో వారే సర్కస్ చేసుకుంటూ…తాము చేస్తున్నది జెమినీ సర్కస్ కంటే సంక్లిష్టమయినది అని కూడా తెలియకుండా ఉన్నారు.
అంతంత ఎత్తులో ఎగురుతూ…దూకుతూ విన్యాసాలు చేస్తుంటే ఊపిరి బిగబట్టి అప్పుడు లోకం చూసింది. ఇప్పుడు రోడ్డు మీద వెళితే ప్రతివాడూ జెమినీ సర్కస్ కంటే గొప్ప ఫీట్లతో బండి నడుపుతాడు. తాగి నడుపుతాడు. హ్యాండిల్ వదిలేసి నడుపుతాడు. కళ్లు మూసుకుని నడుపుతాడు. 200 కిలోమీటర్ల వేగంతో మెట్రో స్తంభానికి గుద్దుకుని…ప్రాణాలు గాల్లో కలుస్తున్నా…డ్రయివింగ్ మారడం లేదు. జెమినీ సర్కస్ ది కంట్రోల్డ్ సిచుయేషన్ లో శిక్షణ పొందినవారు నిపుణుల పర్యవేక్షణలో చేసేది. మనది యమధర్మరాజే భయపడి పక్కకు తప్పుకోవాల్సిన విన్యాసం.
జెమినీ సర్కస్ సీరియస్ విన్యాసాల మధ్య ఆటవిడుపు అవసమయ్యింది కాబట్టి శంకరన్ జోకర్లు, బఫూన్లు వచ్చి నవ్వించగలిగారు. ఇప్పుడు సమాజం నిండా జోకర్లు, బఫూన్లే. ఎంతటి సీరియస్ విషయాలనయినా ఈ బఫూన్లు జోకులుగానే చెబుతున్నప్పుడు విడిగా జోకర్లతో పని ఏముంటుంది?
సింహం, గ్రామ సింహం రెండిటిలో సింహం కామన్ అనుకున్న ఉదాసీనత వచ్చినప్పుడే గ్రామ సింహాల విలువ పెరిగి…అసలు సింహాల విలువ తిరిగింది. (గ్రామ సింహం అనగా కుక్క అని నిఘంటువు అంటుంది)
కాకి నడకల వారు రాజహంసల నడకలను అనుకరించబోయినప్పుడు రాజహంసలు అంతర్ధానమయ్యాయి. నాట్యం నేర్చుకునే వారు “నెమలికి నేర్పిన నడకలివీ…” అని నెమళ్ల మీద పడి నాట్యం చేసినప్పుడు నెమళ్ల కాళ్లు విరిగి నాట్యం చేయలేని నిస్సహాయతలో మూలన పడి ఉన్నాయి.
చెబుతూ పోతే…మన బతుకే ఒక పెద్ద సర్కస్. ఖద్దరు కట్టిన ప్రతివాడూ ఒక రింగ్ మాస్టరు.
రాత్రికి రాత్రి వేల, లక్షల కోట్ల నిధులున్న బ్యాంకులు దివాలా తీసి…నెత్తిన గుడ్డ వేసుకునే సర్కస్ ఫీట్ ముందు జెమినీ శంకరన్ సర్కస్ ఫీట్ సూర్యుడి ముందు కనీసం దివిటీ కూడా కాదు.
ప్రజాస్వామ్యం పేరుతో పార్టీలు ఆడుకునే ప్రజాప్రతినిధుల కొనుగోళ్ల సర్కస్ ఆటలో ప్రజలు కనీసం జోకర్లుగా కూడా మిగలని ప్రహసనం ముందు జెమినీ శంకరన్ సర్కస్ కు రిలవెన్స్ ఉండాలనుకోవడం అత్యాశ. అభాస అవుతుంది.
ఇప్పుడు సర్కస్ ఊరవతల గూడారాల్లో, బోనుల్లో లేదు.
మన ఊరి మధ్య, మన ఇంట్లో, మన ఒంట్లో అణువణువునా ఇంకిపోయింది. అందుకే జెమినీ సర్కస్ లు భారంగా, మౌనంగా, వాటికవిగా అంతరించిపోయాయి.
బాధపడకండి.
సర్కస్ స్వరూప, స్వభావాలే మారాయి.
సర్కస్ ఉనికికి ఎలాంటి ప్రమాదం లేదు!
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]