Vidadala Rajini: బాబువన్నీ టెంపరరీ ఆలోచనలే

రాజమండ్రి మెడికల్  కాలేజ్ ను ప్రాధాన్యతగా తీసుకొని మే నెలాఖరుకు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి 150 ఎంబిబిఎస్ సీట్లు దీని ద్వారా అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని వెల్లడించారు. దీనితో పాటు విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, నంద్యాల కాలేజీల్లో కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతులన్నీ  అతి త్వరలో వస్తాయని, వాటిలో కూడా అడ్మిషన్లు చేపడతామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రూ. 475 కోట్ల వ్యయంతో నిర్మిస్తోన్న రాజమండ్రి మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను ఎంపి మార్గాని భరత్, అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని సిఎం జగన్ సంకల్పించారని, ప్రజలందరికీ మెరుగైన, అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు చిత్తశుద్దితో పని చేస్తున్నామని తెలిపారు. జగన్ పాలన వైద్య రంగానికి ఓ స్వర్ణ యుగమని ప్రశంసించారు.  పేదలకు వైద్యం అందించేందుకు ఎంత ఖర్చుయినా ఫర్వాలేదని సిఎం చెప్పారన్నారు.    బాబు హయంలో చేసిందేమీ లేదని, చెప్పుకోడానికి ఏమీ లేదని… ఆయన అన్నీ టెంపరరీ ఆలోచనలు చేస్తారని…  కానీ జగన్    మాత్రం ఏమి చేసినా రాష్ట్ర ప్రజలకు, రాబోయే తరాలకు ఉపయోగపడాలన్న దృక్పథంతో చేస్తారని మంత్రి వివరించారు.

దముంటే మీ హయంలో ఏమి చేశారో చెప్పాలని, లేకపోతే తాము చేస్తున్న మంచిని మెచ్చుకోకపోయినా ఫర్వాలేదు కానీ విమర్శలు చేయవద్దని హితవు పలికారు. మంత్రి మేకప్ వేసుకొని తిరుగుతారంటూ టిడిపి నేత చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై రజని స్పందించారు. వారి ఇంట్లో కూడా మహిళలు ఉండే ఉంటారని, గతంలో ఆయన వనజాక్షితో వ్యవహరించిన తీరును రాష్ట్రం మొత్తం చూసిందని, మహిళల పట్ల ఆయనకు ఏమాత్రం గౌరవం ఉండే అప్పుడే తెలిసిందని వ్యాఖ్యానించారు. మహిళల పట్ల సంస్కారం లేని వ్యక్తుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు.  ఎలక్ట్రికల్ పరికరాలు రిపేర్ కావడం సహజంగా జరిగేదేనని, వాటిని ఎప్పటికప్పుడు బాగు చేయించి తిరిగి అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *