మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు రెండో కుమారుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ రత్నకుమార్ గుండెపోటుతో చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో ఈ ఉదయం కన్నుమూశారు. కోవిడ్ బారిన పడ్డ రత్న కుమార్ దాన్నుంచి కోలుకున్నారు. రెండు రోజుల క్రితమే నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చింది.
చాలాకాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలసిస్ పై ఉన్నట్లు సమాచారం. ఇదే క్రమంలో రత్నకుమార్‌కు గుండె నొప్పి రావడంతో మరణించారు.
గాయకుడిగా ఎదగాలని అవకాశాల కోసం రత్న కుమార్ ప్రయత్నించినా సఫలం కాలేదు. ఒకసారి తెలుగు సినిమా అయిన కంచి కామాక్షికి తమిళంలో డబ్బింగ్ చెప్పారు రత్నకుమార్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో డబ్బింగ్ ఆర్టిస్టుగా అవకాశాలు వెల్లువెత్తడంతో దాన్నే కెరీర్ గా మార్చుకున్నారు. వెయ్యి సినిమాలకు రత్న కుమార్ డబ్బింగ్ చెప్పారు.
32 ఏళ్లుగా సినీ, టెలివిజన్ పరిశ్రమకు ఆయన సేవలు అందించారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళంలో మొత్తంగా 1076కి పైగా సినిమాలకు రత్న కుమార్ డబ్బింగ్ చెప్పారు. ఏకధాటిగా ఎనిమిది గంటలు నాన్ స్టాప్‌గా డబ్బింగ్ చెప్పి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులకెక్కారు. అంతే కాకుండా తమిళనాడులోనూ ప్రత్యేక రికార్డులు క్రియేట్ చేశారు. తమిళం, తెలుగు, మళయాలం, హిందీ, సంస్కృతం ఇలా అన్ని భాషల్లోనూ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణించారు.