The Theory on Dog: …ఆ విధంగా తెలంగాణాలో కుక్కల నుండి తమను తాము రక్షించుకోవడానికి పసి పిల్లలకు తగిన శిక్షణ ఇవ్వాలని, చిట్కాలు నేర్పాలని, అవగాహన కలిగించాలని నిర్ణయం తీసుకోవడమైనది. కుక్కల సంతానోత్పత్తి తగ్గించడానికి వెను వెంటనే చర్యలు తీసుకోవాలని గట్టిగా అనుకున్నారు. హోటళ్లు వ్యర్థ పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా కట్టడి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కుక్కకాటుకు గురి కాకుండా ఇంకా అనేకానేక సలహాలు, సూచనల మీద పురపాలక శాఖ అత్యవసర అత్యున్నత స్థాయి సమావేశం లోతుగా చర్చించే ఉంటుంది.
మిగతా విషయాలు ఎలా ఉన్నా-
1. పసి పిల్లలకు వీధి కుక్కల వీర విహారం గురించి అవగాహన కలిగించడం
2. వీధి కుక్కలు పసివాడిని పీక్కు తినడానికి హైదరాబాద్ మేయర్ చెప్పిన శునక సిద్ధాంతం
మాత్రం సామాన్యులకు అర్థం కావడం లేదు. అంతమాత్రం చేత సామాన్యులు ఖంగారు పడాల్సిన పనిలేదు. ఏ సమస్యకయినా ముందు- చర్చ; సమీక్ష; రాద్ధాంతం: సిద్ధాంతం; కార్యాచరణ ప్రణాళిక లాంటి దశలు తప్పవు.
కమ్యూనిస్టులు సిద్ధాంతీకరించిన గతి తార్కిక భౌతిక వాదంలా
పురపాలక శాఖ సిద్ధాంతీకరించిన పసి పిల్లలకు వీధి శునకాల అవగాహన;
మేయర్ సిద్ధాంతీకరించిన వీధి కుక్కల ఆకలి పోరాటాలు చాలా లోతయిన, గంభీరమయిన విషయాలు.
- కుక్కలు ఎన్ని రకములు?
- వీధిలో ఉన్న వీధి కుక్కల్లో పిచ్చి కుక్కలను గుర్తించుట ఎట్లు?
- మంచి కుక్కలు ఎలాంటి పరిస్థితుల్లో పిచ్చి కుక్కలుగా మారును?
- మన పిక్కల కండ కుక్క నోట్లో ఉండగా ఎవరికి ఫోన్ చేయవలెను? ఏ యాప్ నొక్కవలెను?
- కుక్కల కాలి వేగం మన కాలి వేగం కంటే ఎంత ఎక్కువ?
లాంటి శునక సంబంధ పరిజ్ఞానం పసిపిల్లలకు కలిగించగలమని పురపాలక శాఖ అనుకుంటున్నట్లు… కుక్కలు కూడా అనుకోవాలి కదా?
హైదరాబాద్ మేయర్ కుక్కలవైపు మాట్లాడి…మనుషులను వదిలేశారని లోకం అనవసరంగా ఆడిపోసుకుంటోంది. కమ్యూనిస్టులు చెప్పే ఆకలి పోరాటాలను ఆమె కుక్కలకు కూడా అన్వయించినట్లున్నారు. మొరిగే, కొరికే, పీక్కు తినే వీధి కుక్కల ఆకలి తీరి ఉంటే…ఆ పసి పిల్లాడి జోలికి వచ్చి ఉండేవి కావన్నది ఆమె సూత్రీకరించిన శునక గతి తార్కిక ఆకలి పోరాటాల భౌ భౌ వాద అస్తిత్వ సిద్ధాంతం.
లోకంలో ఏదయినా ఒకటి జరిగితే…వెను వెంటనే మన చుట్టు పక్కల అలాంటివే జరుగుతున్నట్లు వార్తలు రావడం సహజం. ఇక ఇది శునక గ్రీష్మం. శునక మాసం. శునక వార్తలు, శునక చర్చలే చర్చలు. ఇప్పుడిది కుక్కల వేళ.
Every dog has its day.
ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది.
ప్రతి మనిషిని ఒక కుక్క కరిచే రోజు వస్తుంది.
మొరిగే కుక్కలు కూడా కరిచే రోజులివి.
కరిచే కుక్కలు కరిచి వెళ్లాక వాటి మెరుగులు కూడా మనమే మొరగాల్సిన రోజులివి.
“కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు;
మనిషి కుక్కను కరిస్తేనే వార్త”
అన్నప్పుడే కుక్కల మనోభావాలు చాలా తీవ్రంగా దెబ్బతిని ఉంటాయి. ఇప్పుడు కరిచే ప్రతి కుక్క కాటులో వార్తా ప్రాధాన్యం ఉందని మనం ఒప్పుకోవాలి. లేకుంటే నష్టపోయేది మనమే.
డాగ్స్ మస్ట్ బి క్రేజీ!
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]