Wednesday, February 26, 2025
HomeTrending NewsDP World: హైదరాబాదు కు అంతర్జాతీయ లాజిస్టిక్స్ సంస్థ

DP World: హైదరాబాదు కు అంతర్జాతీయ లాజిస్టిక్స్ సంస్థ

తెలంగాణ రాష్ట్రంలో 215 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి తన కార్యక్రమాలను విస్తరించనున్నట్లు ప్రముఖ పోర్టు ఆపరేటర్ డిపి వరల్డ్ తెలిపింది. డిపి వరల్డ్ గ్రూప్ కార్యనిర్వాక ఉపాధ్యక్షులు అనిల్ మెహతా మరియు డిపి వరల్డ్ ప్రాజెక్టు డెవలప్మెంట్ డైరెక్టర్ సాలుష్ శాస్త్రిలు ఈరోజు మంత్రి కేతారకరామారావుతో దుబాయ్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిపి వరల్డ్ తెలంగాణలో తన కార్యకలాపాల విస్తరణ తాలూకు ప్రణాళికలను ప్రకటించింది.

పోర్ట్ ఆపరేటర్ గా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న డిపి వరల్డ్ హైదరాబాదులో తన ఇన్లాండ్ కంటైనర్ డిపో ఆపరేషన్ కోసం 165 కోట్లను పెట్టుబడిగా పెట్టి, తన కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేసింది.

మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గత తొమ్మిది సంవత్సరాలలో చేపట్టిన అనేక వ్యాపార అనుకూల పాలసీలను కార్యక్రమాలను వివరించారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగ ప్రగతికి చేదోడు వాదోడుగా నిలిచే కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌసింగ్ రంగంలో డిపి వరల్డ్ తన పెట్టుబడిని తెలంగాణలో పెట్టనున్నట్లు తెలిపింది. మేడ్చల్ ప్రాంతంలో 5000 ప్యాలెట్ కెపాసిటీ కలిగిన కోల్డ్ స్టోరేజ్ వేర్హౌస్ ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్నట్లు, ఇందుకోసం 50 కోట్ల రూపాయల పెట్టుబడిని పెడుతున్నట్లు సంస్థ మంత్రి కేటీఆర్ కి తెలియజేసింది.

డిపి వరల్డ్ వంటి అంతర్జాతీయ లాజిస్టిక్స్ దిగ్గజం తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం తన కార్యకలాపాలను విస్తరించడం వలన తెలంగాణ లాజిస్టిక్స్ రంగం బలోపేతం కావడానికి ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. డిపి వరల్డ్ తన కార్యకలాపాల విస్తరణ కోసం కావలసిన అన్ని రకాల సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం నుంచి అందిస్తామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్