జీవో నంబర్ 1 ను అమలు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు బాబు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, ఆ మాటలు వింటుంటే ఆయనకు పిచ్చి పట్టిందని అనిపిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా వ్యాఖ్యానించారు. సభలు, రోడ్ షోలు చేయవద్దని ఆ జీవోలో ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ఖాళీ ప్రదేశాల్లో, గ్రౌండ్స్ లో సభలు పెట్టుకోవచ్చని స్పష్టంగా ఉందని, ఒక్కసారి వారు జీవోను చదువుకోవాలని సూచించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు.
బాబు ఇన్నిసార్లు కుప్పం వెళ్తున్నారంటే అక్కడ టిడిపి సమాధి కాబోతుందని స్పష్టంగా తెలుస్తుందని రాంబాబు అన్నారు. నా కుప్పం , నా కుప్పం అంటూ బాబు మాట్లాడుతున్నారని… అసలు ఆయనకు అక్కడ ఇల్లు కూడా లేదని, కనీసం ఓటు కూడా లేదని విమర్శించారు. తనను చూసి వైసీపీ భయపడుతోందని బాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఆయన ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారని, కానీ తమకు ఏమీ కాలేదని ఎద్దేవా చేశారు. కందుకూరు ఘటనలో ఎనిమిది మంది టిడిపి కార్యకర్తలు చనిపోయారని, కానీ గుంటూరులో చీరలు, చింతపండు ఇస్తామంటే వెళ్లి ముగ్గురు పేదలు మరణించారని అన్నారు.
ప్రాణాలు కోల్పోతున్న అమాయకులను కాపాడదానికే ఈ జీవో తెచ్చాం తప్ప బాబును అడ్డుకోవాలని కాదని, ఆ అవసరం తమకు ఏమాత్రం లేదని రాంబాబు స్పష్టం చేశారు. కేవలం భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు పొందడానికి బాబు ప్రయత్నిస్తున్నారని, ఆయన చేస్తున్న యాగీని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. తన వల్ల 11 మంది చనిపోతే దాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం లేనిపోని ఆవేశం తెచ్చుకొని బాబు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిని దృష్టిలో పెట్టుకొని చట్టాలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.
Also Read : ఫిబ్రవరి నుంచి విద్యార్ధులకు రాగి మాల్ట్ : సిఎం