దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు నేడు (అక్టోబర్ 12, మంగళవారం) శ్రీ సరస్వతి దేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవి పూజ చేస్తారు. మహిషాసుర వధలో భాగంగా అతడి సైన్యంలోని శుంభుడనే రాక్షసుణ్ణి మహా సరస్వతి మట్టుబెట్టిందని పురాణాల్లో ఉంది. వేదకాలం నుంచి సరస్వతీ ఆరాధన భారతదేశంలో ముఖ్యంగా హిందూ ధర్మంలో ఒక భాగమైంది. ఈ రోజున సరస్వతి రూపంలో ఉన్న అమ్మవారిని పూజించే వారికి చదువులతో పాటు సకల భాగ్యాలూ కలుగుతాయని భక్తుల విశ్వాసం.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం చేరుకొని అమ్మ వారికి సంబంధించి ఆగ్‌మెంట్ రియాల్టీ షో ప్రారంభించిన అనంతరం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
ముఖ్యమంత్రి దుర్గగుడి పర్యటనకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సోమవారం నగరంలోని ఇరిగేషన్ మోడల్ గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ జె నివాస్, నగర పోలీస్ కమిషనర్ బి శ్రీనివాసులు, పోలీస్, దేవాదాయ, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖల అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
నవరాత్రులలో తొలిరోజున స్వర్ణకవచాలంకృత అలంకారంలో, రెండవ రోజున బాలా త్రిపుర సుందరిగా, మూడోరోజున శ్రీ గాయత్రీ దేవిగా, నాలుగో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా, నిన్న ఐదో రోజున శుద్ధ పంచమి, షష్టి తిథులు ఒకేరోజు వచ్చినందున మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం లోనూ, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు ఆశీస్సులు అందించారు. .
రేపు, 13-10-2021శుద్ధ అష్టమి బుధవారం రోజున శ్రీ దుర్గాదేవి(దుర్గాష్టమి)
14-10-2021 శుద్ధ నవమి గురువారం రోజున శ్రీ మహిషాసురమర్దని(మహార్ణవమి)
15-10-2021 శుద్ధ దశమి శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి(విజయదశమి)
15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం జరుగుతుంది