గోపీచంద్ కథానాయకుడిగా ‘భీమా’ సినిమా రూపొందింది. కెకె రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాకి, హర్ష దర్శకత్వం వహించాడు. మార్చి 8వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతాన్ని అందించాడు. అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు.
నిజానికి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఎద్దుపై గోపీచంద్ ఎంట్రీ ఇచ్చే పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక గోపీచంద్ హైటు .. పర్సనాలిటీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు సరిగ్గా సరిపోతుంది గనుక, మాస్ యాక్షన్ ఒక రేంజ్ లో ఉండొచ్చని ప్రేక్షకులు భావించారు. యాక్షన్ విషయంలో ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరచలేదు. కానీ ఆశించిన స్థాయిలో ఎమోషన్ – కామెడీ కనెక్ట్ కాలేదనిపిస్తుంది.
గోపీచంద్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు. అయితే పోలీస్ రోల్ స్థాయిలో మరో పాత్రను డిజైన్ చేయకపోవడం ఒక లోపంగా అనిపిస్తుంది. ఆ రోల్ ను కూడా ఇంట్రెస్టింగ్ గా మలిచి ఉంటే కథ తప్పకుండా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేదనే అభిప్రాయం కలుగుతుంది. గోపీచంద్ సరసన మాళవిక శర్మ – ప్రియా భవాని శంకర్ కథానాయికలుగా నటించారు. యాక్షన్ సీన్స్ ను డిజైన్ చేసిన తీరు .. లొకేషన్స్ .. ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందో చూడాలి.