జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ రంగంలో తీసుకున్న అనాలోచిత విధానాల వల్ల ప్రజలపై అదనపు భారం పడుతోందని టిడిపి నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ఈ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేవిధంగానే ఉన్నాయని ఆరోపించారు. తాజాగా పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టుల పేరిట తన అనుయాయులకు ప్రజల ఆస్తులను ఏకపక్షంగా కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వ మార్గ దర్శకాలకు, సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. సహజ వనరులను కేటాయించేటప్పుడు కొన్ని విధి విధానాలను పాటించాల్సి ఉంటుందని, కానీ ఇవీమీ లేకుండా ఏకపక్షంగా, టెండర్లు పివలకుండా, నామినేషన్ పద్దతి ద్వారా ఏవిధంగా కట్టబెడతారని ప్రశ్నించారు.
గత ప్రభుత్వంలో విండ్ పవర్ లో పెట్టుబడులు పెట్టిన వారిని ఉద్దేశ పూర్వకంగా వేధించదానికే వారి నుంచి విద్యుత్ కొనకుండా ప్రైవేట్ సంస్థల నుంచి ఎక్కువ ధరకు కొన్నారని, కానీ కోర్టు మాత్రం కొనకపోయినా వారికి డబ్బులు చెల్లించాల్సిందే అంటూ తీర్పు చెప్పిందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయంలో విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయంటూ జగన్ చేసిన ఆరోపణలు తప్పని హైకోర్టు తీర్పు చెప్పిన విషయాన్ని కేశవ్ గుర్తు చేశారు. విండ్, సోలార్ పవర్ పర్చేసెస్ లో అవినీతి జరిగిందంటూస్వయంగా జగన్ చెప్పడం వల్ల రాష్ట్రంలో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకున్న ఎన్నో కంపెనీలు వెనక్కు వెళ్ళాయన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.