వైసీపీ ప్రభుత్వంపై తాము చేపట్టిన ఛార్జ్ షీట్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. ప్రజలు స్వచ్చందంగా ముందుకొచ్చి తమ ఆవేదన చెప్పారని, 20,107 ఫిర్యాదులు ఇప్పటివరకూ అందాయన్నారు. తాము వేసిన ఛార్జ్ షీట్ లను కలిపి ఓ పుస్తకం తీసుకొస్తామని చెప్పారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు గన్నవరంలో జరిగాయి. సోము వీర్రాజు అధ్యక్షోపన్యాసం చేశారు.
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమయ్యిందని, ఫసల్ బీమా యోజన అమలు చేయలేకపోతోందని విమర్శించారు. రైతు భరోసా కేంద్రాలు రైతు దోపిడీ కేంద్రాలుగా మారాయన్నారు. రైతును మోసం చేస్తూ మిల్లర్లకు ఈ ప్రభుత్వం కొమ్ము కాస్తోందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం 20లక్షల ఇళ్ళకు నిధులు ఇస్తే వాటిని దారి మళ్ళించారని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరును మార్చారని పేర్కొన్నారు. సెంటు భూమి పేరిట భూముల కొనుగోళ్లలో గోల్ మాల్ చేశారని, రోడ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తే తన బంధువులకు వాటి కాంట్రాక్టులు ఇచ్చుకున్నారని ఆరోపణలు గుప్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి బ్రాందీ ఆదాయం మీద ఉన్న శ్రద్ధ ఆయూష్ వైద్య రంగంపై లేదని, ఇది దౌర్భాగ్యమని వీర్రాజు ధ్వజమెత్తారు.
తొమ్మిదేళ్లుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన నిధులపై కాయకర్తలు ప్రచారం చేయాలని సోము సూచించారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని రాష్ట్రం అమలు చేయడం లేదని, కనీసం ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా చెల్లించలేకపోతోందని అన్నారు.