Lets talk: ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణ నిర్ణయించిన నేపథ్యంలో ఈ విషయమై చర్చలు జరిపి ఓ సానుకూల నిర్ణయం తీసుకుందామని ప్రభుత్వం పిలుపు ఇచ్చింది. ప్రభుత్వం మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర నాథ్, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, సిఎస్ సమీర్ శర్మలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
అయితే ఈ ఆహ్వానంపై ఉద్యోగ సంఘాలు ఇంకా తమ నిర్ణయాన్ని ప్రకటించలేదు. నేడు జరగనున్న స్టీరింగ్ కమిటీలో ఓ నిర్ణయం తీసుకుంటామని, అయితే జీవోలను రద్దు చేయాలి.. లేదా అబెయన్సులో పెట్టాలని, ఆ తర్వాతే చర్చలకు వెళ్తామని, ప్రభుత్వం కూడా ఏదో ఒక సానుకూల నిర్ణయం తీసుకుని ఆ తర్వాతా చర్చలకు ఆహ్వానిస్తే బాగుంటుందని వారు చెబుతున్నారు. ఇప్పటివరకూ ప్రభుత్వం చర్చలను ఓ ప్రహసనంగానే నిర్వహించిందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. కేవలం ఉద్యోగ సంఘాల నేతలను సముదాయించేందుకు, వారిని బుజ్జగించేందుకే నిర్వహిస్తున్నారు తప్ప ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉండడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వం నిర్ధిష్టంగా ఓ నిర్ణయం తీసుకొని ఆ తర్వాత చర్చలకు పిలిస్తే ఉపయోగం ఉంటుందని వారు అభిప్రాయ పడుతున్నారు.
కాగా, ఉద్యోగ సంఘాలు ఫిబ్రవరి 7నుంచి నిరవధిక సమ్మెకు వెళ్ళాలని తీర్మానించారు. దీనిపై రేపు ఫిబ్రవరి 24న సమ్మె నోటీసు ఇవ్వాలని మొన్న జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించుకున్నారు.
25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు, 26న అన్ని తాలూకా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహానికి మెమొరాండాల సమర్పణ. ఈ నెల 27 నుంచి 30 వరకు నాలుగు రోజుల పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహారదీక్షలు, ఫిబ్రవరి 3వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమం, ఫిబ్రవరి 5 నుంచి సహాయ నిరాకరణ, ఫిబ్రవరి 7 నుంచి నిరవధి సమ్మెకు మొన్నటి సమావేశంలో నిర్ణయించారు. ఆర్టీసీ కార్మికులు కూడా ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు.