ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కులగణనకు శ్రీకారం చుట్టింది. నవంబర్ 15వ తేది నుంచి రాష్ట్రంలో సమగ్ర కులగణన మొదలవుతుందని ప్రభుత్వం పేర్కొంది. వెనుకబడిన వర్గాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో అత్యంత వెనుకబడిన కులాలను గుర్తించి, వారిని ఉన్నత స్థాయికి తీసుకురావాలనే లక్ష్యంతోనే సమగ్ర కులగణన చేపట్టడం జరుగుతోందని ప్రభుత్వం ప్రకటించింది.
చంద్రబాబు అరెస్టు, బెయిల్ న్యూస్ మినహా మీడియాలో, నేతల చర్చల్లో ఎక్కడా ప్రాధాన్యం లభించని ఈ వార్త రాబోయే రోజుల్లో రాజకీయ ప్రభంజనం సృష్టిస్తుంది. కులగణన పూర్తి చేసి వివరాలు వెల్లడించిన రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుందో తెలుగు ప్రజలకు తెలుస్తుంది.
విధాన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వ శాఖలు, వాటిని ప్రభావితం చేసే రంగాలు కులం కంపుతో నిండిన రాష్ట్రంలో… సాహసోపేత నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. ఈ నిర్ణయంతో సిఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారు. ఏపి ప్రస్థానంలోనే మొదటిసారిగా బీసీ కులాలకు అగ్రతాంబూలం వేస్తూ… ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారు. మంత్రివర్గం సహా.. అన్ని రకాల నామినేటెడ్ పోస్టుల్లో బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కాకి లెక్కలతోనే ప్రభుత్వాలు కాలం వెల్లదీస్తున్నాయి. కులగణన ద్వారా ఎన్నో చీకటి కోణాలు…అభివృద్దికి నోచని అభాగ్యుల కథలు లోకానికి తెలుస్తాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో పదే పదే ముఖ్యమంత్రి ఈ వర్గాలనే ప్రస్తావిస్తున్నారు. కులం చూడం..మతం చూడం… ప్రాంతం చూడం అందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని ఘంటా పథంగా చెపుతున్నారు.
తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి ఎన్టిఆర్ రాజకీయాల్లోకి వచ్చాక బలహీన వర్గాలకు అవకాశాలు ఇచ్చారు. టిడిపి… చంద్రబాబు ఏలుబడిలోకి వచ్చాక బలహీన వర్గాల పేరు చెప్పటమే కానీ…అందలాలు అగ్రవర్ణాలకే దక్కాయి. ఇందుకు భిన్నంగా సిఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జగన్ మోహన్ రెడ్డి… బీసీలకు సముచిత స్థానం కల్పించారు.
మరో ఏడాదిలో ఎన్నికలు ఉండగా కులగణనకు పూనుకోవటం….పటిష్టమైన సచివాలయ వ్యవస్థ ఉన్న నేపథ్యంలో నాలుగు నెలల్లో గణాంకాలు విడుదల చేసే అవకాశం ఉంది. రాబోయే ఏపి ఎన్నికల్లో ఇదే ప్రధాన ప్రచార అంశం అవుతుంది.
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 80 శాతం భూమి అగ్రవర్ణాల చేతుల్లో ఉంటే కేవలం 20 శాతం భూమికి బలహీన వర్గాలు, SC, STలు హక్కుదారులు. కుల గణన ద్వారా ఇలాంటి అంశాలు ఎన్నో వెలుగులోకి వస్తాయి. అక్షరాస్యతా…విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఎవరి పెత్తనం సాగుతుందో స్పష్టత వస్తుంది.
కులగణనతో ఏపి రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. జనాభా ఆధారంగా దామాషా పద్దతిలో అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం కల్పించాలి. 2024 శాసనసభ ఎన్నికల్లో కుల గణన గణాంకాలకు అనుగుణంగా టికెట్లు ఇవ్వాల్సిన అగత్యం ఏర్పడుతుంది. రాజకీయ ప్రాతినిధ్యం దక్కని కులాలు ఆయా పార్టీలకు ఓటుతో సమాధానం ఇస్తాయి. పోలింగ్ దగ్గర పడే సమయానికి తెలంగాణ ఎన్నికల్లో కూడా కుల గణన అంశం చర్చకు రానుంది.
-దేశవేని భాస్కర్