Babu letter to DGP: వంగవీటి రాధా ఇంటివద్ద రెక్కీ నిర్వహించిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు అయన రాష్ట్ర డిజిపి గౌతమ్ సావాంగ్ కు లేఖ రాశారు. రాధాను హతమార్చేందుకే రెక్కీ నిర్వహించి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన చంద్రబాబు, రాధాకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి భయానకంగా ఉందని, రాధా ఇంటి వద్ద రెక్కీ.. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలకు నిదర్శనంగా నిలుస్తుందని బాబు అన్నారు. విపక్ష నాయకుల బెదిరింపుల పరంపరలో భాగంగానే ఇప్పుడు రాధాను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. గతంలో జరిగిన సంఘటనలపై కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఇలాంటి ఘటనలు జరిగి ఉండేవి కాదని అయన అభిప్రాయపడ్డారు.
కాగా, వంగవీటి రాధాను ఫోన్ లో బాబు పరామర్శించి రెక్కీ వార్తలపై ఆరా తీశారు. భద్రత విషయంలో అశ్రద్ధ వద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన భద్రతను అంగీకరించి ఉండాల్సిందని రాధాతో అన్నట్లు తెలిసింది. కుట్ర కోణంపై పార్టీ పార్టీ తరఫున పోరాటం చేద్దామని, పార్టీ పరంగా అండగా ఉంటామని రాధాకు బాబు భరోసా ఇచ్చారు.
Also Read : బంగ్లా-త్రిపుర సరిహద్దుల్లో భారీగా పేలుడు సామాగ్రి