నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీపి కబురు అందించారు. ఈ మేరకు శాసనసభలో సిఎం కెసిఆర్ ఈ రోజు ప్రకటించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం.. ఒక్కొక్కటిగా సాకారం చేసుకుంటూ వెళ్తోంది. భారీ ప్రాజెక్టులతో ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరందించి తెలంగాణను సస్యశ్యామలం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ మానస పుత్రిక అయిన మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరును అందించారు. ప్రభుత్వానికి వివిధ మార్గాల్లో సమకూరుతున్న ఆదాయ వనరులను సబ్బండ వర్గాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. అంతే కాకుండా ఏడేండ్లలోనే అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచి, తలసరి ఆదాయంలో నంబర్‌వన్‌గా నిలిచింది. ఇప్పటికే వివిధ శాఖల్లో లక్షకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం.. నేడు భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసింది. 80,039 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ రోజు నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని సీఎం ప్రకటించారు.
తెలంగాణ పరిధిలోని అన్ని యూనివర్సిటీల్లో 2,020 బోధన పోస్టులను, 2,774 బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో మొత్తం ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142 ఉన్నాయని తేలింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా రాష్ట్రంలోని నేరుగా నియామకం చేయాల్సిన ఖాళీల సంఖ్య 80,039 ఉన్నట్లు తేలిందని సీఎం తెలిపారు.
ఈ పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందనే శుభవార్తను రాష్ట్ర యువతకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ భర్తీ ప్రక్రియ వల్ల ఏటా సుమారు రూ. 7,000 కోట్ల అదనపు భారం రాష్ట్ర ఖజానాపై పడుతుంది. అయినా కూడా ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది. ఇక నుంచి ఖాళీలను ముందే గుర్తించి, ప్రతీ సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ను ప్రకటించి, పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని విభాగాలు తమ వద్ద ప్రతీ సంవత్సరం ఏర్పడే ఖాళీల వివరాలు సిద్ధం చేస్తాయి. నోటిఫికేషన్ల జారీ కోసం ఆయా నియామక సంస్థలకు సమాచారం ఇస్తాయి. ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రకటనతో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఉపాధ్యాయులకు పదోన్నతులు : సీఎం కేసీఆర్