Wednesday, March 26, 2025
HomeTrending Newsఉపాధ్యాయులకు పదోన్నతులు : సీఎం కేసీఆర్‌

ఉపాధ్యాయులకు పదోన్నతులు : సీఎం కేసీఆర్‌

Teachers Promotions : ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్‌ ఈ రోజు వనపర్తిలో ప్రకటించారు. మంగళవారం వనపర్తి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇస్తామన్నారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లను ఇవ్వాలని విద్యాశాఖ మంత్రిని కోరడంతో పాటు సీఎస్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఇంకా సీఎం మాట్లాడుతూ.. ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్‌ రూల్స్‌ ఎక్కడున్నయంటే.. వేరే రాష్ట్రానికి చెందిన వాళ్లు.. తెలంగాణకు వచ్చి నేర్చుకొని వెళ్లేలా ఉండాలి.
30, 35 సంవత్సరాలు పని చేసిన వ్యక్తులకు ఎప్పుడు ప్రమోషన్లు ఏ టైంకు వస్తయ్‌.. ఎప్పుడు రిటైర్డ్‌ అవుతారు.. రిటైర్డ్‌ అయ్యే లోపే బెనిఫిట్స్‌ అన్నీ రెడీ చేసి పదవీ విరమణ రోజున కార్యాలయంలో సన్మానించి, అధికారిక వాహనంలో దించిరావాలని చెప్పాను. కష్టపడి సేవ చేసిన వారిని గుర్తిస్తే వచ్చే వారు మంచిగా పని చేసే అవకాశం ఉంటుంది. ఇవాళ మనం సాధించింది తక్కువ. దీన్ని చూసే చాలా మంది.. చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. తెలంగాణ వచ్చే ముందు జరిగినటువంటి ప్రచారాలు, తెలంగాణపై పెట్టిన నిందలు విన్నాం. కానీ, ఇప్పుడు అవి రివర్స్‌ అయ్యాయి.
ఆ రాష్ట్రాల కంటే మన తలసరి ఆదాయం ఎక్కువ
ఎన్నో రాష్ట్రాలు మనకన్నా ఆర్థికంగా, పారిశ్రామికంగా ముందున్నం అని చెప్పుకున్నటువంటి రాష్ట్రాల కంటే మన రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువ. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు కంటే పలు రాష్ట్రాల కంటే ఎక్కువ.. ఇదంతా మీ కృషే. ఇవాళ 24 గంటలు అన్ని రంగాలకు ఎక్కడ కూడా నిమిషం కూడా కరెంటు పోకుండా సరఫరా చేసే ఒకేఒక రాష్ట్రం తెలంగాణ. గతంలో 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ ఉన్న సమయంలో విద్యుత్‌ అత్యధిక వినియోగం 13600 మెగావాట్లు. ఇవాళ తెలంగాణ 14వేల మెగావాట్లకు వెళ్తున్నది. ఇంకా 14వేల మెగావాట్లయినా సరఫరా చేస్తామని అధికారులు అంటున్నరు. ఎన్ని కొత్త పరిశ్రమలు వచ్చినా.. విద్యుత్‌ వినియోగం ఎంత పెరిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, రాబోయే 10, 15 సంవత్సరాల వరకు బాధలేకుండా చేసినం.
ఇప్పుడు విద్య, వైద్యంపైనే దృష్టి
అవస్థలు పడ్డవాళ్లం.. కష్టపడ్డం కాబట్టి ఇవాళ ఇవన్నీ బ్రహ్మాండంగా చేసుకున్నాం. ప్రాథమికంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాం. మంచినీళ్ల బాధ పోయింది. కరెంటు బాధ పోయింది.. సాగునీటి సమస్య పోయింది.. పోతున్నది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే పటిష్ట పడుతాం. ఈ రకంగా మినిమమ్‌ బేసిక్‌ ఇష్యూస్‌ చేసుకున్నం. ఇప్పుడు విద్య, వైద్యం మీద దృష్టి పెట్టాం. మన ఊరు – మన బడి రాష్ట్ర కార్యక్రమమైనా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా వనపర్తి నుంచే ప్రారంభం చేసుకున్నాం. ప్రభుత్వ రంగంలో విద్య కూడా చాలా అద్భుతంగా జరగాలే. దాదాపు 10వేల కోట్ల ఖర్చుతో కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. వైద్య రంగంలో కూడా ముందుకు దూసుకెళ్తున్నాం.
నిరంజన్‌రెడ్డిని చూసి గర్వపడుతున్నా
నాకు నిరంజన్‌రెడ్డి వ్యక్తిగతమైన మిత్రుడు. ఇలాంటి మిత్రుడిని కలిగి ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. ఇవాళ వనపర్తి ప్రాంతంలో వచ్చిన అద్భుతమైన అభివృద్ధి ఇక్కడ ఎవరూ ఊహించలే. ఇవాళ ఏ రంగంలో చూసినా తపనపడే నాయకత్వం. పని చేసి సాధించాలే.. నా ప్రజలకు మేలు చేయాలి నాకు అవకాశం ఉన్నప్పుడు అని తండ్లాడే వారుంటే అన్ని జిల్లాలు వనపర్తిలా తయారవుతాయి. ఆయన నాయకత్వంలో పని చేయాలి. గ్రామ పంచాయతీలు బాగా పని చేస్తున్నాయ్‌.. వాటిని అభినందిస్తున్నాను. మిగతా కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు అభివృద్ధి కావాలి.
సీఎం నిధి నుంచి ప్రత్యేకంగా వనపర్తికి రూ.కోటి
ప్రత్యేకంగా వనపర్తి పట్టణానికి సీఎం నిధి నుంచి రూ.కోటి, మిగతా మున్సిపాలిటీలకు రూ.50లక్షలు, అదే విధంగా గ్రామ పంచాయతీలకు అదనంగా రూ.20లక్షలు మంజూరు చేస్తున్నా. తెలంగాణ కలెక్టరేట్ల ఆర్కిటెక్చర్‌ ఉషారెడ్డి. ఆమె పక్కా తెలంగాణ బిడ్డ.. ఆమెది భువనగిరి జిల్లాలో పుట్టారు. తెలంగాణకు ప్రతిభ లేదు.. తెలివి లేదంటే మా తెలివి ఇట్లుంది.. వనపర్తి కలెక్టరేట్‌ బిల్డింగ్‌లా ఉన్నది. నేను ఎవరినీ నిందించడం లేదు. ఆనాడు ఎవరైతే అన్నరో వారినే అంటున్నం. నిందించే అవసరం లేదు. ఆ రోజు మాటలు పడ్డం కాబట్టి ఆ పౌరుషం ఉంటది. దీనికే తృప్తి పడితే సరిపోదు. ఇంకా బ్రహ్మాండమైన పనులు జరగాలే. మహబూబ్‌నగర్‌ అంటే కరువు జిల్లాగా పేరుంది. జిల్లాలో 25,30వేల ఎకరాల విస్తీర్ణంలో అడవి ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. జిల్లా మంత్రి, కలెక్టర్‌ పూర్తి శ్రద్ధ వహించి గ్రామాలు, పట్టణాల్లో హరితహారం, విలేజీ నర్సరీలను చాలా బాగా చేయాలి. అవెన్యూ ప్లాంటేషన్‌ కూడా బాగా చేయాలి.
రాష్ట్రంలో అత్యధికంగా వర్షాలు వనపర్తి జిల్లాలో
గతంలో నార్మల్‌ రెయిన్‌ఫాల్‌ 500 అని చెప్పారు. రాష్ట్రంలో అత్యధిక వర్షాలు ఇప్పుడు వనపర్తి జిల్లాలో కరుసున్నయ్‌ రెండు సంవత్సరాల నుంచి. అసలు కరువున్నది మాయమయ్యే పరిస్థితి ఉన్నది. ఇంకా కూడా కాలువలన్నీ మంజూరయ్యాయి. కాలువలు, ఎత్తిపోతలు పూర్తయితే వనపర్తి జిల్లా బంగారు పర్తి కావాలని కోరుకుంటున్నా. ఇంకా ఇక్కడ అద్భుతాలు కావాలే. మరోసారి అందరినీ అభినందిస్తూ, హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెబుతున్నా’ అన్నారు. ఈ సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్