Thursday, June 11, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవరి విజ్ఞానానికి ఎల్ విజయలక్ష్మి నృత్యానికి ఏమిటి సంబంధం?

వరి విజ్ఞానానికి ఎల్ విజయలక్ష్మి నృత్యానికి ఏమిటి సంబంధం?

తెలుగు వరి రైతులకూ, సినీ నటి ఎల్. విజయలక్ష్మికి, ‘వీక్షణం ‘ జూమ్
పత్రికకు ఏమిటి సంబంధం?
ఒకటి ఉంది.

‘హరిత విప్లవం’లో భాగంగా అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ సహా ఆసియాలో వరి ఉత్పత్తి పెరిగేందుకు,
తద్వారా రైతుల ఆర్థిక వ్యవస్థను మార్చివేసేందుకు దోహదపడిన ‘IR-8’ అనే అధిక వరి వంగడాన్ని
అభివృద్ధి చేసిన బృందంలో కీలక సైంటిస్టు, వ్యవసాయరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘నార్మన్ బొర్లాగ్ ‘  అవార్డు గ్రహీత అయిన ప్రొ. సుర్జిత్ కుమార్ డే దత్తా ‘ఈ సెప్టెంబర్ 13న కాలిఫోర్నియాలో 13వ ‘వీక్షణం ‘ పత్రిక వార్షిక సాహితీ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 350కి పైగా వ్యవసాయ పరిశోధనా పత్రాలను, వ్యవసాయ శాస్త్రంపై పలు గ్రంథాలను రచించినందుకు ఈ సుర్జిత్ కుమార్ ను అనేక అంతర్జాతీయ విశిష్ట పురస్కారాలు వరించాయి.

అయితే ఈయనకి తెలుగు సాహిత్యానికి ఏమిటి సంబంధం ? ఒకటి ఉంది. 1960 దశకంలో తెలుగు తెరమీద నృత్యం నేర్చిన నటిగా తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఎల్. విజయలక్ష్మికి భర్త ఈయన. వీక్షణం వార్షిక సాహితీ సమావేశానికి భార్యతో సహా వచ్చిన సుర్జిత్ కుమార్ ని – అతిథులకు ఆతిథ్యం ఇచ్చిన శ్రీ పెద్దు సుభాష్ అడిగిన ఒక ప్రశ్నకు ఆయన 45 నిమిషాలు మాట్లాడినప్పుడు మన తెలుగు రైతులు కూడా ఈయనకు రుణపడి వున్నారనిపించింది.

1960 దశకంలో మన తెలుగు రైతులు చూసిన తొలి అధిక వరివంగడాలు తైచుంగ్ నేటివ్ (తైవాన్), IR-8. అయితే, IR-8 ఎక్కువ దిగుబడిని ఇచ్చేలా రూపొందించామని సుర్జిత్ కుమార్ చెప్పారు.

“మీరు సైంటిస్టు కదా? మా ఈ అభిమాన తార మీ జీవితంలోకి ఎలా వచ్చారు?” అని ‘వీక్షణం’ ప్రధాన నిర్వాహకురాలు డా. గీతా మాధవి అడిగితే ఓ ‘రహస్యం’ చెప్పారు సుర్జిత్:

“నేను బెంగాలీని. వీళ్ళ అన్నయ్య నా స్నేహితుడు. నేను మద్రాసులో ఓసారి అతన్ని కలిసినప్పుడు మాటల్లో చెప్పాను – మా వాళ్లు నన్ను పెళ్లిచేసుకోమని గొడవ పెట్టేస్తున్నారు అని. ‘అయితే మా చెల్లిని చూడరాదా?’ అన్నాడు అతను. మొహమాటానికి ‘సరే, చూద్దాం’ అన్నాను. ఆ సమయానికి ఆమె ఏ.వి.ఎం స్టూడియోలో షూటింగులో ఉంది. సరే, చూశాను. నేను కలకత్తా వెళ్లాక ఈ సంగతి చెబితే, మా అక్క ఒప్పుకోలేదు. ‘నువ్వు చేసుకుంటే ఒక మంచి నర్తకిని చేసుకోవాలిరా’ అని పట్టుబట్టింది. ఎలాంటి నర్తకి? ఆమె తాను అంతకు కొన్ని రోజుల ముందు బెంగాలీ భాషలో చూసిన ‘నర్తనశాల ‘చిత్రంలో ఉత్తర పాత్ర అమ్మాయి గురించి చెబుతోంది. ‘ఆ అమ్మాయే ఈ అమ్మాయి ‘ అని నేను చెప్పగానే ఎగిరి గంతేసింది…. అలా మా పెళ్లి జరిగిపోయింది. మీ దృష్టిలో ఆమె ఒక తార. నాకు మాత్రం అన్ని విధాలా వెన్నుదన్నుగా నిలబడిన జీవిత భాగస్వామి...”

ఈ సాహితీ సభలో శ్రీమతి విజయలక్ష్మి – మెట్రిక్ కూడా పాసవని తను పెళ్లయ్య్హాక మనిలాలో మిగతా సైంటిస్టుల భార్యలను చూసి ప్రేరణ పొంది చదువు కొనసాగించానని, అలాగే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివానని చెప్పారు. తాను నటించిన కాలంలో ఎన్.టి.ఆర్ గారిలో క్రమశిక్షణ చూశాననీ, అక్కినేని గారిలో ఎప్పుడూ ఉల్లాసంగా ఉండటం చూశానని, ఇప్పటి పరిస్థితుల్లో తనకు మళ్లీ నటించాలని అనిపించలేదని చెప్పారు.

ఎస్. వరలక్ష్మి గారి కథల్లో మానవత ఎలా ఉట్టిపడుతుందో ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే సోదాహరణంగా చెప్పారు. జి.వల్లీశ్వర్ పాత్రికేయ వృత్తిలో తమ అనుభవాలు కొన్ని పంచుకున్నారు.

తెలుగులో ‘టాక్ షో’ల మార్గదర్శిగా పేరు పొందిన శ్రీ కిరణ్ ప్రభ తాను చాలా మాసాలక్రితం టాక్ షో చేసిన విజయలక్ష్మిగారిని ఇప్పుడే కలుస్తున్నాను అన్నారు. అనేక పరిణామదశలను దాటుకుంటూ ఇంగ్లాండులో ఉచ్ఛ స్థాయికి ఎదిగిన, చరిత్ర మర్చిపోయిన టంగుటూరి సూర్యకుమారి వంటి మహా వ్యక్తుల గురించి లోతుగా అధ్యయనం చేసే అవకాశం తనకు టాక్ షోల వల్లనే లభించిందని అన్నారు. శ్రీ కిరణ్ ప్రభ, కౌముది పత్రిక సంపాదకురాలు శ్రీమతి కాంతి కిరణ్ చేతుల మీదుగా ‘వీక్షణం ‘ ప్రత్యేక సంచికల ఆవిష్కరణ జరిగింది. శ్రీ రావు తల్లాప్రగడ సారథ్యంలో కవి సమ్మేళనం జరిగింది.

శ్రీమతి ఎల్. విజయలక్ష్మి, శ్రీమతి అవ్వారి గాయత్రి గానం చేసిన కీర్తనలు ఈ సాహితీ సదస్సుకి మరింత వన్నెలద్దాయి.

-వల్లీశ్వర్ గుండు
(అమెరికా నుండి)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular