రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్ వల్లనే రాష్ట్రంలో భూ తగాదాలు తగ్గాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఎవరి భూమి వారి చేతుల్లోనే ఉండటానికైనా, రైతుబంధు, రైతుబీమా సకాలంలో రావడానికైనా, భూముల రిజిస్ట్రేషన్ గోస తీరడానికైనా, ధాన్యం పైసలు తక్షణం రైతుల బ్యాంకు ఖాతాల్లో పడటానికైనా ధరణే కారణమని స్పష్టంచేశారు. ధరణితో రైతుల గోస తీరందని తెలిపారు. తెలంగాణకు సింగరేణి సంస్థ వజ్రపు తునక అని, దీన్ని కాంగ్రెస్ సగం చంపితే, మిగతా సగాన్ని చంపేందుకు బీజేపీ కంకణం కట్టుకొన్నదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాలలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..కొత్తగా ఏర్పాటైన మంచిర్యాల జిల్లాలో కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉన్నది. మంచిర్యాల జిల్లా కావాలనేది ప్రజల చిరకాల కాంక్ష. దానిని నెరవేర్చాం. మంచిర్యాలలో మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా దవాఖాన నెలకొల్పాం. బీఆర్‌ఎస్ చేసిన మంచి పనులు అన్ని గ్రామాలకు చేరాయి. మంచిర్యాల, బెల్లంపల్లివాసులు 150 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన బాధలు తప్పాయి.
ధరణి పోర్టల్ వల్లనే నేడు గంటలోపే రిజిస్ట్రేషన్, పది నిమిషాల్లోనే పాస్‌బుక్ లభిస్తున్నాయని తెలిపారు. గతంలో ప్రతి పనికి లంచం ఇవ్వాల్సి వచ్చేందని, ధరణితో ఆ దుర్మార్గానికి ముగింపు పలికామని పేర్కొన్నారు. ‘గతంలో రైతులకు వారి భూమి ఎక్కడుందో తెలిసేది కాదు. ఏం మాట్లాడినా లంచమియ్యాలె.. పహాణీ నకలు కావాలంటే లంచమియ్యాలె.. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే లంచమియ్యాలె.. పైరవీకారులకు లంచమియ్యాలె.. పట్టా కావాలంటే చెప్పులరిగేదాకా తిరగాల్సి వచ్చేది’ అని గుర్తుచేశారు.
ఆదివాసీ, గిరిజనులకు పోడు భూములపై పట్టాలు ఇస్తున్నామని, యాదవ సోదరులకు రెండో విడత గొర్రెలు పంపిణీ చేస్తున్నామని, మంచిర్యాల నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎంబీసీ కులాల్లో వెనుకబడినవారికి రూ.లక్ష ఆర్థికసాయం అందించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించామని, సొంత జాగా ఉన్నవాళ్లకు ఇల్లు కట్టుకొనేందుకు రూ.3 లక్షల ఆర్థికసాయం అందించే గృహలక్ష్మి పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వల్ల గోదావరి నది 250 కిలోమీటర్ల మేర జల కళను సంతరించుకొన్నదని సీఎం చెప్పారు. ఇటువంటి గోదావరిని ఎన్నటికైనా చూస్తామా! అని ఉద్యమ సమయంలో అనుకొనేవాడిని ఇప్పుడు సజీవ గోదావరిని చూస్తుంటే కండ్లు నిండినయ్. ఇది తెలంగాణ వచ్చిన ఫలితం. పట్టుబట్టి, జట్టుకట్టి లక్ష్మి, పార్వతి, సరస్వతీ బరాజ్‌లతోపాటు పెండింగ్‌లో ఉన్న ఎల్లంపల్లిని పూర్తి చేసుకొంటే 250 కిలోమీటర్ల మేర గోదావరిని సస్యశ్యామలం చేసుకుంటం’ అని పేర్కొన్నారు.