Sunday, September 8, 2024
HomeTrending Newsగ్రూప్-1 ఉద్యోగాల‌న్నీలోక‌ల్ రిజ‌ర్వేష‌న్ల ప‌రిధిలోకే

గ్రూప్-1 ఉద్యోగాల‌న్నీలోక‌ల్ రిజ‌ర్వేష‌న్ల ప‌రిధిలోకే

రాష్ట్రంలో ఇక నుంచి భ‌ర్తీ చేసే ఆర్డీవో, డీఎస్పీ, సీటీవో, ఆర్టీవోతో పాటు గ్రూప్-1 ఉద్యోగాల‌న్నీ లోకల్ రిజ‌ర్వేష‌న్ల ప‌రిధిలోకి వ‌స్తాయ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ శాస‌న‌స‌భా వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఉద్యోగ నియామ‌కాల భ‌ర్తీపై శాస‌న‌స‌భ వేదిక‌గా సీఎం సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. ఇందులో భాగంగా ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించారు.

కొత్తగా సాధించుకున్న రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ శాతం పెరగటమే కాకుండా స్థానిక రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే పోస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని కేసీఆర్ తెలిపారు. గత ఉత్తర్వుల ప్రకారం ఆర్డీవో, డీఎస్పీ, సిటివో, ఆర్‌టీవో, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ తదితర గ్రూప్ 1 ఉద్యోగాలకు లోకల్ రిజర్వేషన్ వర్తించేది కాదు. ఇప్పుడు ఇవన్నీ కూడా లోకల్ రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకొచ్చామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు.

గతంలో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 60 నుంచి 80 శాతం వరకు మాత్రమే లోకల్ రిజర్వేషన్ పరిధి ఉండేది. ఇప్పుడు అన్ని పోస్టులకు 95 శాతం లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుంది అని స్ప‌ష్టం చేశారు. స్థానిక అభ్యర్థులు తమ స్వంత జిల్లా, జోన్, మల్టీ జోన్‌లలో 95 శాతం రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కలిగి ఉండడమే కాక ఇతర జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్‌లలో 5 శాతం ఓపెన్ కోటా ఉద్యోగాలకు కూడా పోటీ పడవచ్చు అని సీఎం పేర్కొన్నారు. స్థానిక అభ్యర్థులు తమ జిల్లాలో జిల్లా కేడర్ పోస్టులకు తమ జోన్ లోని జోనల్ క్యాడర్ పోస్టులకు అర్హత కలిగి ఉంటారని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. నిరుద్యోగ యువత ఆయా ఉద్యోగాలకు పోటీ పడటానికి గతం కన్నా ఎక్కువ అవకాశాలు లభిస్తాయని తెలియజేస్తున్నానని సీఎం పేర్కొన్నారు. 7 జోన్లు, 33 జిల్లాల వారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం వల్ల రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగ ఖాళీలు, సిబ్బంది కొరత వంటి సమస్యలు తీరుతాయని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

Also Read : తెలంగాణలో ఉద్యోగాల జాతర

RELATED ARTICLES

Most Popular

న్యూస్