Sunday, January 19, 2025
HomeTrending NewsTelangana: ఇద్దరు అసాధ్యులే...కలిసిరాని అదృష్టం

Telangana: ఇద్దరు అసాధ్యులే…కలిసిరాని అదృష్టం

తెలంగాణ ఎన్నికలు ఓ ఆసక్తికరమైన సన్నివేశానికి వేదిక అయ్యాయి. వాళ్ళిద్దరూ ఏ పార్టీలో ఉన్నా అగ్రనేతలు..ప్రజాభిమానం కలిగిన నేతలు.. పేరొందిన పారిశ్రామికవేత్తలు. ఒకరు ఉత్తర తెలంగాణకు చెందిన వారు కాగా మరొకరు దక్షిణ తెలంగాణ నేత. రాజకీయ ఉద్దండులైన ఆ ఇద్దరు నేతలే గుడిసెల వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వీరిద్దరికీ కొన్ని విషయాల్లో సారూప్యం ఉంది.

2009లో ఇద్దరు నేతలు ఎంపిలుగా ప్రజాసేవ చేశారు. పెద్దపల్లి నుంచి వివేక్, భువనగిరి నుంచి రాజగోపాల్ రెడ్డి ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమంలో ఇద్దరు నేతలు ఎవరి స్థాయిలో వారు కీలక పాత్ర పోషించారు.

తెలంగాణ వాదులు పిలిస్తే పలికే నేతగా పేరున్న వివేక్…ఉద్యమ సమయంలో ప్రజా నేతగా పేరు సంపాదించారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలంగాణ వాణి వినిపించటంలో ఏనాడు వెనుకడుగు వేయలేదు. తెలంగాణవాదులకు అండగా నిలిచి ప్రత్యేకరాష్ట్ర వాదాన్ని బలంగా వినిపించారు.

తెలంగాణ వచ్చాక వివేక్ తప్పుడు అంచనాలతో రాజకీయంగా పలుచనయ్యారు. 2014లో పెద్దపల్లి ఎంపిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. బీఆర్ఎస్ నుంచి బాల్క సుమన్ బరిలో నిలిచారు. వివేక్ ను గెలిపించేందుకే బలహీనమైన అభ్యర్థిని కెసిఆర్ పోటీకి పెట్టారని పుకార్లు లేచాయి. అప్పటి కారు జోరులో వివేక్ ఓడిపోయి సుమన్ గెలిచారు.

2019లో అదే పెద్దపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ నేత మీద వివేక్ ఓటమి చవి చూశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరి ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత బిజెపిలో చేరారు. బిజెపి మేనిఫెస్టో కమిటి చైర్మన్ గా ఉన్న సమయంలోనే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఈ దఫా చెన్నూర్ నుంచి హస్తం అభ్యర్థిగా అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2009లో భువనగిరి నుంచి గెలిచి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. లోకసభలో, ఢిల్లీ వేదికగా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ బలంగా వినిపించారు. నల్గొండ జిల్లాలో తెలంగాణ వాదం బలపడేందుకు దోహదం చేశారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బూర నర్సయ్య గౌడ్ చేతిలో ఓడిపోయారు. నల్గొండ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గానికి శాసనమండలి సభ్యునిగా గెలుపొందారు. 3 సంవత్సరాల పదవీకాలం మిగిలి ఉండగానే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి 2018 అసెంబ్లీ ఎన్నికలలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా గెలుపొందారు.

2021 ఆగస్టులో కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడులో బిజెపి తరపున పోటీ చేయగా ఓటమిపాలయ్యారు. ఈ క్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తప్పించటం, మద్యం కుంభకోణం ఆరోపణల్లో ఎమ్మెల్సి కవితను అరెస్టు చేయకపోవటంతో రాజగోపాల్ రెడ్డి పునరాలోచనలో పడ్డారు. కవితను అరెస్టు చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయని వ్యాఖ్యలు చేసి కమలం కాక పుట్టించారు.

ఇద్దరు నేతలు సిఎం కెసిఆర్ ఓటమే లక్ష్యంగా బిజెపిలో చేరారు. మద్యం వ్యవహారంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. నష్ట నివారణకు ఉపక్రమించిన కమలం నాయకత్వం వివేక్ కు పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, రాజగోపాల్ రెడ్డికి పార్టీ స్క్రీనింగ్ కమిటి చైర్మన్ పదవులు కట్టబెట్టింది. ఇద్దరు నేతలకు కీలక పదవులు వచ్చినా ఏ నిర్ణయం తీసుకోలేని అశక్తత పార్టీలో ఉండింది.

కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు అలవాటుపడ్డ వీరికి బిజెపి విధానాలు సరిపడలేదని వినికిడి. కెసిఆర్ ఓటమే లక్ష్యంగా కమలం చెంతకు చేరినా..పార్టీ కార్యాచరణ భిన్నంగా ఉందని వీరు అనుమానపడ్డారు. దీంతో ఒకరి తర్వాత ఒకరు హస్తం గూటికి చేరారు. వివేక్ చెన్నూరు నుంచి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి బరిలో ఉన్నారు.

వీరిద్దరి రాకతో రెండు చోట్ల సిపిఐ కి షాక్ తగిలింది. పొత్తుల్లో ఈ స్థానాలు సిపిఐకి ఇవ్వాలని కాంగ్రెస్ సూత్రప్రాయంగా చర్చలు జరుపుతున్న సమయంలో ఇద్దరు నేతలు కాంగ్రెస్ లో చేరటం, స్థానాలు కేటాయించటం చక చకా జరిగాయి. చివరకు సిపిఐ కొత్తగూడెంతో సర్డుకుపోవల్సి వచ్చింది.

ఇద్దరు నేతలు పాత ప్రత్యర్థులతోనే తలపడటం గమనార్హం. తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచారు..కాంగ్రెస్ లో ఎదిగారు.. బిజెపిలో కలిసి కట్టుగా సాగారు. ఇంటి పార్టీకి చేరుకొని, కారును ఆగం చేయాలనే ఈ ఇలాపురం జోడి లక్ష్యం నెరవేరుతుందా చూడాలి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్