రైతుల న్యాయపరమైన పోరాటాన్ని అణిచివేయాలని కేంద్రం శతవిధాలా ప్రయత్నం చేస్తోందని శాసనమండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ఉత్తరప్రదేశ్ లో నిన్న ఎనిమిది మంది రైతులను చంపిన ఘటన కలచివేసిందన్నారు. ఇక్కడనేమో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరంగా నీతులు మాట్లాడుతున్నాడని నల్గొండలో గుత్తా మండిపడ్డారు. బిజెపి నేతలు అధికారంలోకి వస్తాం అని పగటి కలలు కంటున్నారని, ఉన్న అధికారాలు పోతాయి జాగ్రత్త అని హెచ్చరించారు. ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు కళ్ళు తెరవాలన్నారు.
బీజేపీ చేస్తున్న దామనకాండకు ప్రజలు సరైన సమయంలో సరైన గుణపాఠం చెప్తారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ లో టి ఆర్ యస్ పార్టీ గెలుపు ఎప్పుడో ఖాయం అయిందని, గెల్లు శ్రీనివాస్ యాదవ్ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంటారన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సుభిక్షంగా ఉందని, ప్రతిపక్షాలు కేసీఆర్ ,కేటీఆర్ మీద బురద జల్లే ప్రయత్నం ఇప్పటికైనా ఆపాలని గుత్తా హితవు పలికారు. కేవలం అధికార యావ తప్ప ప్రజల సంక్షేమం బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు పట్టవని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, బండి సంజయ్ ,రేవంత్ లు చడ్డీ గ్యాంగ్ ల్లాగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలోకి వస్తే దారి దోపిడీలు చేసి ప్రజలను దోచుకుంటారని, చమురు ధరలను పెంచుతూ బీజేపీ పార్టీ ప్రజల జేబులను కొడుతున్నదన్నారు.
తను టి.అర్.యస్ పార్టీకి రాజీనామ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయని, ఇది పూర్తిగా అబద్ధం అని గుత్తా సుఖేందర్ రెడ్డి తెగేసి చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తను ఎవ్వరు నమ్మవద్దని, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని గుత్తా స్పష్టం చేశారు.