Saturday, November 23, 2024
HomeTrending Newsఓటు బ్యాంకు రాజకీయాలు: జీవీఎల్

ఓటు బ్యాంకు రాజకీయాలు: జీవీఎల్

రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలపైనే దృష్టి పెట్టి అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తోందని బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు విమర్శించారు. అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం ఓటు బ్యాంకు కోసమే ఆలోచనలు చేస్తే చివరకు ఆ ఓటు బ్యాంకు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని అయన హెచ్చరించారు. విశాఖపట్నం బిజెపి కార్యాలయంలో జీవీఎల్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

అప్పు పుట్టకపోతే పూట గడవని పరిస్థితిలో రాష్ట్రం ఉందన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నామని  చెప్పుకుంటున్న ప్రభుత్వం వానిని కూడా సరిగా అమలు చేయలేకపోతోందని జీవీఎల్ చెప్పారు.  రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి నానాటికీ క్షీణిస్తున్నా, దాన్ని మెరుగుపరచుకోవడం కోసం సరైన దిశలో ఆలోచించకుండా, ప్రజలపైనే పన్నుల భారం వేస్తోందని జీవీల్ విమర్శించారు.

అభివృద్ధిపై జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఒక్క రూపాయి ఖర్చు చేసినట్లు దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయని, వాటిని తమ గొప్పగా వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతోందని దుయ్యబట్టారు. రాష్ట్రం తమ వాటాగా అందించాల్సిన నిధులను విడుదల చేయకపోడంతో దాదాపు 10 రైల్వే ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని, వీటిలో అత్యంత ముఖ్యమైన నడికుడి-శ్రీకాళహస్తి లైన్ కూడా ఉందని  అయన వెల్లడించారు. విశాఖపట్నం-రాయపూర్ ఎక్స్ ప్రెస్ వే పనులు కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని, అయితే దాన్ని తామే చేపడుతున్నట్లు జగన్ ప్రభుత్వం చెబుతోందని అన్నారు. విజయవాడ- బెంగుళూరు ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణంలో భూసేకరణ మొదలుకొని మొత్తం ప్రాజెక్టును కేంద్రమే చేపడుతోందని, దీనికోసం మూడున్నర వేల కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేసిందని జీవీఎల్ వెల్లడించారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ కూడా పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్