its not correct: హోదా అంశాన్ని కేంద్ర హోం శాఖ అజెండా నుంచి తొలగించడానికి తానే కారణమంటూ వైసీపీ తో పాటు పలు పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని బిజెపికి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఖండించారు. అజెండాలో మార్పు చేసిన అంశంపై వెంటనే ఒక ప్రకటన ఇవ్వాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శికి జీవీఎల్ లేఖ రాశారు. సబ్ కమిటీ అజెండాలో పెట్టాల్సిన అంశాలను నిర్ధారించేందుకు మరో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. ఢిల్లీ లోని బిజెపి కేంద్ర కార్యాలయంలో జీవీఎల్ మీడియాతో మాట్లాడారు.
హోం శాఖ కమిటి రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేశారని, ఈ కమిటీ సమావేశంలో ఏపీ హోదా అంశాన్ని ఎలా చర్చిస్తారని ప్రశ్నించారు. హోదా అంశాన్ని చేర్చిన విషయమై అంతర్గత విచారణ జరుగుతోందని చెప్పారు.
ప్రధాని స్వయంగా మాట్లాడి ఈ అంశాన్ని అజందాలో పొందుపరిస్తే జీవీఎల్ తీసేయించారని వైసీపీకి చెందిన ఓ మంత్రి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. మోడీ, అమిత్ షా ల నిర్ణయాన్ని తాము మార్పించే ఆలోచన చేస్తామా అని ప్రశ్నించారు. చంద్రబాబు చెబితే తాను చేశానంటూ చౌకబారు విమర్షలు చేస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని జీవీఎల్ విమర్శించారు.
Also Read : రెండు రాష్ట్రాల అంశాలకే పరిమితం: సోము