Friday, March 20, 2026
HomeTrending Newsసమ్మక్క సారక్క స్ఫూర్తితో దొరలపై పోరాటం - రేవంత్ రెడ్డి

సమ్మక్క సారక్క స్ఫూర్తితో దొరలపై పోరాటం – రేవంత్ రెడ్డి

2014 నుంచి 2017 వరకు రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. 2017 నుంచి ఇప్పటివరకు రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ గాంధిభవన్ లో మీడియాతో మాట్లాడుతూ  హాత్ సె హాత్ జోడో యాత్ర వివరాలు వెల్లడించారు.

ఫిబ్రవరి 6 నుంచి మేడారం నుంచి యాత్ర మొదలై మహబూబాబాద్ పార్లమెంట్ లోని 7 అసెంబ్లీల పరిధిలో తాను ప్రత్యక్షంగా పాల్గొంటానని రేవంత్ రెడ్డి తెలిపారు. అందరు నాయకులు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని రాహుల్ సందేశాన్ని ఇంటింటికి చేరవేస్తారన్నారు. కొత్త నియామకాలు చేసేవరకు పాత మండల అధ్యక్షులే హాత్ సే హాత్ జోడో యాత్రకు పని చేస్తారని, ఈ నెల 24,25,26 ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు ఛత్తీస్ గఢ్ లో జరుగుతాయని పేర్కొన్నారు. ఆ మూడు రోజులు యాత్రకు బ్రేక్ ఉంటుందన్నారు.

రాష్ట్రంలో 2003 పరిస్థితులే 2023 లో దాపురించాయని, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయని రేవంత్ రెడ్డి చెప్పారు. అమరుల కుటుంబాలు అనాధలుగా మారాయని, ధరణితో విపరీతమైన సమస్యలు వచ్చాయని మండిపడ్డారు. రాజులు, రాచరికం మీద గిరిజన హక్కుల కోసం సమ్మక్క సారక్క రక్తం చిందించారని, అదే స్ఫూర్తితో దొరల మీద పోరాటం చేసేందుకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు. బీజేపీ, బీఆరెస్ రెండు ఒకే తానులోని మొక్కలని, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ నాటకాలకు తెర లేపారని ఆరోపించారు.

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంతో వారి నాటకం బట్టబయలైందని, గవర్నర్ తో పచ్చి అబద్దాలు చెప్పించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 119 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్లిచ్చారు? కనీసం కీలక మంత్రుల సొంత గ్రామాల్లోనైనా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చారా? ఎర్రబెల్లి సొంత గ్రామంలో ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చారా?  కేసీఆర్ చింతమడకలో ఇచ్చారా? హరీష్ సొంత ఊరిలో ఇచ్చారా అని ప్రశ్నించారు.

పచ్చి అబద్దాలు చెప్పి గవర్నర్ కేసీఆర్ ను కాపాడే ప్రయత్నం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. గవర్నర్ ను బ్రాండ్ అంబాసిడర్ గా చేసి కేసీఆర్ అబద్ధాలను కప్పి పుచ్చారని, మేం ముందు నుంచి చెబుతున్నట్టుగానే బీజేపీ, బీఆరెస్ రెండూ ఒక్కటే అన్నారు. బీజేపీ భ్రమల నుంచి తెలంగాణ సమాజం బయటపడాలని, రాష్ట్రంలో బీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే అని స్పష్టం చేశారు. కేటీఆర్ కు క్యాట్ వాక్, డిస్కో డాన్స్ ల గురించి మాత్రమే తెలుసని, దేశ సమగ్రత గురించి మాట్లాడేంత అవగాహన కేటీఆర్ కు లేదన్నారు. కేటీఆర్ కు రాహుల్ ను విమర్శించేంత స్థాయి లేదని, తండ్రీ, కొడుకులకు రాజకీయ ప్రయోజనాల ముఖ్యం.. కాంగ్రెస్ కు దేశ ప్రయోజనాలు ముఖ్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular