“చెవిటివాడిముందు శంఖం ఊదినట్లు…” అని తెలుగులో అనాదిగా వాడుకలో ఉన్న సామెత. నిజానికి శంఖం ఊదితే ఊపిరితిత్తులకు ఆరోగ్యం; విన్నవాడి చెవులకు అమృతం. అన్నమయ్య అన్నట్లు “చెవి బడలిక” తొలగిపోతుంది. అయితే సామెత ఉద్దేశం శంఖం ఊదడం లేదా శంఖనాదం వినడం కాదు. చెవిటివాడిముందు శంఖం ఊది ప్రయోజనం లేదన్నదే సామెత చెప్పదలుచుకున్న నీతి.

అనుభవమైతేగానీ తత్వం బోధపడదు. కొంతకాలంగా నా కుడి చెవి వినిపించడం మానేసింది. బాషాలో రజనీకాంత్ ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లు. నాకేమో వందసార్లు చెప్పినా ఒక్కసారి కూడా వినపడి చావదు. ఎవరైనా ఎడమవైపు ఉండి మాట్లాడితే ఆ మాటల్లో సగమైనా అర్థమవుతుంది. కుడివైపు మాట్లాడితే అంతే సంగతులు. దాంతో మాట్లాడుతున్నవారి పెదవుల కదలికను గమనిస్తూ విషయాన్ని వీలైనంత పట్టుకోగలగడం నేర్చుకున్నాను. ఇంట్లోవారు, బయటివారు ఈ చెవిటిమాలోకానికి ఒకటికి పదిసార్లు చెప్పలేక చస్తున్నాం- అని విసుక్కోవడం పెరిగాక…దశాబ్దాలుగా పరిచయమున్న ఈ ఎన్ టీ డాక్టర్ కె వి ఎస్ ఎస్ ఆర్ కె శాస్త్రి దగ్గరికి వెళ్ళా. చెవుడుతో చస్తున్నానని నేను వెళితే…ఆయన నవ్వుతూ తెలుగు పద్యాలు, అన్నమయ్య పదాల చర్చ మొదలుపెట్టారు. సమస్య చెవికే కానీ…నోటికి కాదు కదా అన్నది వైద్యుడిగా శాస్త్రిగారి శాస్త్రీయ విధానం అయి ఉంటుందనుకుని పద్యాలు పాడాను. ఆయన మోచేతికి కొట్టుకుని లోహపు ముక్కను నా చెవిదగ్గర పెట్టారు. కుడి చెవి పూర్తీ పోయింది. ఒక రంధ్రం పడింది. సర్జరీ చేయాలి- అన్నారు. చెవిలోపలికి కెమెరా పంపి ఎంత రంధ్రం, ఎక్కడ పడిందో ప్రత్యక్షంగా టీ వీ తెరమీద చూపించారు. రంధ్రం ఎలా ఏర్పడి ఉంటుందని అడిగాను. వినకూడనివి ఏమేమి విన్నారో! పాపం చెవి చిల్లుపడింది అని తాత్వికంగా చెప్పారు. ఎడమ చెవి వినికిడి కూడా గొప్పగా లేదని తేల్చారు.

“వినరో భాగ్యము విష్ణుకథ…” అని అన్నమయ్య అన్నా…చెవుడువల్ల వినలేకపోతున్నాను కాబట్టి…వినే భాగ్యంకోసం సర్జరీ చేయించుకోవాల్సిందే అని ముహూర్తం నిర్ణయించుకున్నాం. ఏమీ తినకుండా పరగడుపున రమ్మన్నారు. వెళ్ళాను. సాధారణ పరీక్షల తరువాత మత్తు ఇచ్చారు. చెవి రంధ్రాన్ని పూడుస్తూ కుట్లు, అల్లికలతో చాలా ప్యాచ్ వర్క్ చేశాము అని స్పృహ వచ్చాక శాస్త్రిగారు చేతిలో చేయివేసి చెప్పారు. నెమ్మదిగా డిస్ చార్జ్ చేశారు. నొప్పి తగ్గడానికి మందులు, ఆయింట్ మెంట్లు, ఇయర్ డ్రాప్స్ ఇచ్చారు. వాడుతున్నాను. నెల దాటింది. రివ్యూకు వెళ్ళాను. ఇంకో నెల ప్రయాణాలు చేయకూడదు. నో ఫ్లయిట్, నో స్విమ్మింగ్, నో హెడ్ బాత్…అంటూ అనేక నోలు వరుసగా పూసగుచ్చినట్లు చెప్పి మందులు మార్చి పంపారు. “ఇంతకూ వినికిడి ఎప్పుడు సాధారణమవుతుంది?” అని అడిగాను. ఎందుకండీ పాడులోకం మాటలు వింటారు? నామాట వినండి- అంటూ లోపల గాయం ఇంకా పచ్చిగానే ఉంది. అది మాని…కుట్లు, అల్లికలన్నీ కర్ణభేరిలో కలగలసిపోతే వినడం దానంతట అదే గాడినపడుతుంది- అని తేట తెలుగు శస్త్రచికిత్స పరిభాషలో విడమరిచి చెప్పారు.
సిరివెన్నెల ఏదో సినిమాలో-
“నువ్వేమన్నావో?
నేనేం విన్నానో?”
అని నాగురించే అని ఉంటారనుకుంటూ…నా వినికిడికి అభయమివ్వమని డాక్టరును ప్రాధేయపడ్డాను. తొందరేముంది? చిన్న రంధ్రమా? పూడుకోవాలి. కాలమే అన్నిటికీ సమాధానం అని కాలస్వరూప స్వభావాలను కూలంకషంగా వివరించారు. నాకన్నా బాగా తెలుగు, సంస్కృతం చదువుకున్న డాక్టరు కాబట్టి ఒక చెవితో సగం అర్థం చేసుకుని…మిగతా సగం కాలానికి వదిలేశాను.
మేమిద్దరూ అన్నమయ్య పదాలు, సిరివెన్నెల పాటలు (సిరివెన్నెలగారు మా ఇద్దరికీ కామన్ ఫ్రెండు, శ్రేయోభిలాషి) పాడుకుంటూ ఉంటే ఆసుపత్రి సిబ్బంది, బయట క్యూలో వేచి ఉన్న రోగులు మాలో పిచ్చివారిని దర్శించగలిగారు.
“విన్నానులే ప్రియా!
కనుగొన్నానులే ప్రియా!”
అని సి నా రె అన్నారు. అలా నేనెప్పుడు వినగలను? ఎప్పుడు అలా అనగలను? అని అడిగాను.

“వినదగు నెవ్వరు చెప్పిన…” అనేరోజు మీకు త్వరలోనే వస్తుంది- అని డాక్టరు పద్యంతో నన్ను ఓదార్చారు. ఆరోజునుండి “వినదగు”రోజు కోసం చెవికోసుకుంటున్నాను!
“శృణ్వం తపః” అంది వేదం. వినడమే తపస్సు. ఇప్పుడు నాది వినికిడికోసం తపస్సు.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

