చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును రిజర్వు చేస్తూ ధర్మాసనం తీర్పు చెప్పింది. అక్టోబర్ 3న మొదలైన వాదనలు నేటి వరకూ కొనసాగాయి. ఈ మధ్యాహ్నం 2 గంటలకు వాదనలు ప్రారంభంకాగా… ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ, బాబు తరఫున హరీష్ సాల్వే తమ వాదనలు సమర్ధవంతంగా వినిపించారు. ఇక్కడితో వాదనలు వినడం పూర్తయ్యిందని, ఇంకా ఏమైనా మిగిలిఉంటే రాతపూర్వకంగా చెప్పవచ్చని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ ఎం బేలా ఎం త్రివేదిలతో కూడిన బెంచ్ సూచించింది. అయితే చంద్రబాబు73 ఏళ్ళ వయసులో 40 రోజులుగా జైల్లో ఉన్నారని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని హరీష్ సాల్వే చేసిన అభ్యర్ధనను బెంచ్ తిరస్కరించింది.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిన సమయంలో 17 (ఏ) చట్టం లేదని, అయినా అవినీతిపరులకు ఈ చట్టం రక్షణ కవచం కాకూడదని రోహాత్గీ వాదించారు. చంద్రబాబుకు ఈ చట్టం వర్తించదని, నిజాయతీ గలిగిన ప్రభుత్వ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వేధింపుల నుంచి రక్షణ కల్పించడానికి మాత్రమే దీన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు. అవినీతి నిరోధక (పిసి) చట్టం కింద కేసు నమోదు అయినప్పుడు మిగిలిన సెక్షన్లు కూడా పెడితే దాన్ని విచారించే అర్హత ప్రత్యేక కోర్టుకు ఉంటుందా అని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. పిసి యాక్ట్ కింద కేసు నమోదైనా కూడా ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ల కింద ఆ కేసును విచారించే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉంటుందని, 482 సెక్షన్ల కింద ఎఫ్ఐఅర్ రద్దు చేయడం కుదరదని, బాబుపై పెట్టిన సెక్షన్లన్నీ విచారణార్హమైనవేనని రోహత్గీ చెప్పారు.
కాగా, ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను శుక్రవారంనాటికి వాయిదా వేస్తూ… అప్పటివరకూ బాబును అరెస్ట్ చేయవద్దని ధర్మాసనం ఆదేశించింది.