హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ఎంతగా ప్రయత్నించినా బంగారం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా షార్జా, దుబాయ్ దేశాల నుండి వచ్చిన 15 మంది ప్రయాణీకులపై అనుమానం వచ్చి కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా బంగారం తరలిస్తున్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు వారి వద్ద నుంచి కోటి 50 లక్షల విలువ చేసే 3 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 15 మంది ప్రయాణీకులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో కస్టమ్స్ అధికారుల దాడుల్లో వరుసగా అక్రమంగా తరలిస్తున్న బంగారం పెద్ద మొత్తంలో పట్టుబడుతున్న సంగతి విదితమే. పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా ఎయిర్‌పోర్ట్ నుంచి వివిధ పద్ధతులలో అక్రమ బంగారం తరలింపు కొనసాగుతుండటం గమనార్హం.