Saturday, November 23, 2024
HomeసినిమాHidimbha: హింసకు అలవాటుపడిన 'హిడింబ' 

Hidimbha: హింసకు అలవాటుపడిన ‘హిడింబ’ 

Mini Review: ఈ వారం థియేటర్స్ కి వచ్చిన సినిమాలలో ‘హిడింబ’ ఒకటి. అశ్విన్ బాబు – నందిత శ్వేత పోలీస్ ఆఫీసర్స్ గా నటించిన సినిమా ఇది. అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, సస్పెన్స్ తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ గా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైదరాబాదు మహానగరంలో ఆడపిల్లలు అదృశ్యమవుతూ ఉంటారు. వాళ్లను ఎవరు ఎత్తుకెళుతున్నారు? ఏం చేస్తున్నారు? అనేది తెలుసుకోవడం పోలీసులకు ఒక సవాలుగా మారుతుంది. ఆ మిస్టరీని ఛేదించడానికి మన హీరో – హీరోయిన్ ఎంటరవుతారు.

నగరంలోని ఆడపిల్లలను కిడ్నాప్ చేసి వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారా? లేదంటే హాస్పిటల్ ముసుగులో అవయవాల కోసం ఒక బృందం ఈ రాకెట్ నడిపిస్తుందా? లేదంటే సైకో కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయా? అనే ఆలోచనలు ఆడియన్స్ లో రేకెత్తిస్తూ ఈ కథ ముందుకు వెళుతూ ఉంటుంది. ఈ అయోమయంలోనే ప్రేక్షకులు కొంతదూరం ప్రయాణం చేసిన తరువాత, అప్పుడు ‘హిడింబ’ అనే పేరు తెరపైకి వస్తుంది. పోలీస్ ఆఫీసర్స్ అడుగులు ఆ దిశగా పడతాయి.

ఇక అక్కడి నుంచి ఫోకస్ అంతా ‘హిడింబ’ వైపు వెళుతుంది. ఈ కేసు కోసం కలుసుకున్న హీరో .. హీరోయిన్ గతంలో బ్రేకప్ అయిన తమ ప్రేమ ప్రయాణాన్ని మొదలుపెడతారు. ఆ వైపు నుంచి కాస్త రొమాంటిక్ టచ్ ఉంటుంది. ‘హిడింబ’కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ కాస్త ఉత్కంఠను కలిగించేదిగానే ఉంటుంది. కానీ తెరపై జరిగే రక్తపాతం ఎక్కువ. పాలసీసాలో రక్తం పట్టి పసి పిల్లాడితో తాగించడం .. పెద్దయిన తరువాత రక్తాన్ని పాయసంలా తాగడం అందరు ప్రేక్షకులు చూడలేరు. ‘హిడింబ’ తెగకి చెందినవారు ఎంత క్రూరంగా ఉంటారనేది చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించాడు. కానీ ప్రేక్షకులు ఎంత సెన్సిటివ్ గా ఉంటారనేది ఆలోచన చేయలేదు. హింస తగ్గించి ఉంటే .. కనీసం తెరపై నేరుగా చూపించకుండా ఉంటే కాస్త ఎక్కువ మార్కులు తెచ్చుకునేదేమో.

RELATED ARTICLES

Most Popular

న్యూస్