తెలంగాణ ప్రజలకు చార్జీల మోత మోగనుంది. విద్యుత్ చార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(టీఎస్‌ఈఆర్సీ) చార్జీల పెంపునకు పచ్చజెండా ఊపింది. విద్యుత్ చార్జీలు 19 శాతం పెంచాలని డిస్కంలు ప్రతిపాదించగా 14 శాతం పెంచేందుకు కమిషన్ అంగీకరించింది. గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్ చార్జీల యూనిట్‌కి 40 పైసల నుంచి 50 పైసల వరకూ పెంచనున్నారు.
ఇతర వినియోగదారులకు యూనిట్‌కి రూపాయి చొప్పున చార్జీల మోత మోగనుంది. అలాగే డొమెస్టిక్ వినియోగదారులపై కొత్తగా ఫిక్స్‌డ్/ కస్టమర్ చార్జీలు విధించనున్నారు. ఇతర వినియోగదారులపై ఇప్పటికే ఉన్న చార్జీలు పెరగనున్నాయి. డిస్కంలు అప్పులలో కూరుకుపోవడంతో చార్జీలు పెంచక తప్పడం లేదని గత కొద్దికాలంగా చర్చ నడుస్తోంది. విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించి డిస్కంలు గత డిసెంబర్‌లోనే ప్రతిపాదనలను టీఎస్‌ఈఆర్సీకి సమర్పించాయి.
టీఎస్‌ఈఆర్సీ ఆమోదిస్తే ఏప్రిల్ ఒకటి నుంచి విద్యుత్ చార్జీలు అవకాశం ఉందని చెబుతూ వస్తున్నారు. ఈఆర్సీ తాజా నిర్ణయంతో వచ్చే నెల నుంచి చార్జీలు పెరిగే అవకాశముంది. వాస్తవానికి విద్యుత్ చార్జీల పెంపు విషయంపై కేసీఆర్ సర్కార్ వెనక్కి తగ్గిందని అంతా భావించారు. ఇటీవల వచ్చిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో విద్యుత్ హామీలే అందుకు కారణం. గృహావసరాలకు ఉచిత విద్యుత్ ఇచ్చే దిశగా పార్టీలు హామీలు గుప్పిస్తుంటే విద్యుత్ చార్జీలు పెంచే సాహసం చేస్తారా? అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ తెలంగాణలో విద్యుత్ చార్జీలు పెంచేందుకు ఈఆర్సీ నిర్ణయించడం గమనార్హం.