తెలంగాణలో అమాత్యుల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. సౌమ్యంగా కనిపించే తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీలో ఈ రోజు అపరిచితుడు ఆవహించినట్టున్నాడు. సమయానికి పూల బోకే అందివ్వలేదని అంగరక్షకుడిపై చేయి చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే ఇవాళ హైదరాబాద్ అమీర్‌పేట డివిజన్ డీకే రోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సీఎం అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, హోం మంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. అనంతరం ఇవాళ మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. వేదికపై ఉన్న తలసానిని ఆలింగనం చేసుకున్న ఆయన.. అంతలోనే బొకే ఎక్కడ? అంటూ పక్కనే ఉన్న అంగరక్షకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయి చేసుకున్నారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.
courtesy:- way to SMS
హోంమంత్రి మహమూద్ అలీ తన గన్మెన్ చెంపపై కొట్టడం వివాదాస్పదమైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్న కారణానికే ఓ ఉద్యోగిపై చేయి చేసుకోవటం ఏంటని నెటిజన్లు హోం మంత్రిని ట్రోల్ చేస్తున్నారు. ఎవరు పలకరించినా ఆత్మీయంగా బదులిచ్చే మహమూద్ అలీకి అంతగా కోపం రావటం ఏంటని ఆయన గురించి తెలిసిన నేతలు అంటున్నారు.
ఇతరులపై చేయి చేసుకుంటూ రాష్ట్ర మంత్రులు తరచూ వివాదాల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మంత్రి కేటిఆర్ తో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందర వెళుతున్న వ్యక్తిపై చేయి చేసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు మంత్రి తలసాని తీరు చూసి హతాశాయులయ్యారు.
ఇటీవల సిద్దిపేట రైల్వే స్టేషన్ ప్రారంభ కార్యక్రమంలో సిఎం కెసిఆర్ ఫోటో పెట్టలేదని ఏకంగా మంత్రి హరీష్ రావు గందరగోళం సృష్టించారు. సభా స్థలం వద్ద బ్యానర్లు చించేశారు. హరీష్ అన్ననే లొల్లికి దిగటంతో గులాబీ సేన…వానర సేనను మించి వీరంగం సృష్టించారు.