ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ పర్యటన పాలమూరుతో పోలిస్తే కొంత భిన్నంగా సాగింది. బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం మీద విమర్శల పదును పెంచారు. సిఎం కెసిఆర్ మీద సంచలన ఆరోపణలు చేశారు. GHMC ఎన్నికలకు ముందు ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినా ఘనంగా స్వాగతం పలికి, సన్మానం చేసిన కెసిఆర్ ఆ తర్వాత మారిపోయాడన్నారు. GHMC ఎన్నికలు ముగిశాక ఢిల్లీ వచ్చిన కెసిఆర్ ఎన్.డి.ఏ కూటమిలో చేరుతామని చెప్పారని, అందుకు తాను నిరాకరించినట్టు వెల్లడించారు.
ఆ తర్వాత మరోసారి వచ్చినపుడు తన బాధ్యతలు అన్నీ కేటిఆర్ కు అప్పగిస్తానని…అందుకు మీ సహకారం కావాలని కెసిఆర్ కోరినట్టు చెప్పారు. రాజు పదవి యువరాజుకు ఇచ్చేందుకు ఇది రాజరికం కాదని, ప్రజాస్వామ్యమని తాను చెప్పినట్టు ప్రధాని వివరించారు. ఆ తర్వాత కెసిఆర్ ఎప్పుడూ తనకు ఎదురుపడలేదన్నారు.
ప్రధాని ఆరోపణలను తెలంగాణ ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారో రాబోయే ఎన్నికల్లో చూడాలి. రాష్ట్రంలో బిజెపికి ఒకసారి అధికారం ఇస్తే బీ.ఆర్.ఎస్ అవినీతిని వెలికితీసి ప్రజల ముందు ఉంచుతామని భరోసా ఇచ్చారు. అందుకే అవినీతి పరులు తన పక్కన కూర్చునేందుకు భయపడుతున్నారని ప్రధాని అన్నారు. తమను గెలిపిస్తే ప్రజారంజక పాలన అందిస్తామన్నారు.
కులగణన అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించిన ప్రధాని కాంగ్రెస్ దక్షిణాదికి అన్యాయం చేస్తోందని ఆరోపించారు. జనాభా ప్రకారం అధికారం ఇవ్వాలని చెపుతున్న కాంగ్రెస్ తమిళనాడులో మైనారిటీ దేవాలయాలను ప్రభుత్వానికి అప్పగించమని కోరుతుందా అని ప్రశ్నించారు. హిందూ దేవాలయాలను ఆదీనంలోకి తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం మైనారిటీల ప్రార్థన స్థలాలు తీసుకోగలదా అని సవాల్ చేశారు. కర్ణాటక ఎన్నికల్లో బీ.ఆర్.ఎస్ సహకరిస్తే ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో సహకరిస్తోందని విమర్శించారు.
పసుపు బోర్డు ప్రాధాన్యతను వివరించిన ప్రధాని… దాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారో ఈ రోజు కూడా స్పష్టత ఇవ్వలేదు. నిజామాబాద్ పసుపు రైతులకు లాభదాయకమని చెప్పినా… బోర్డు ఈ ప్రాంతంలోనే వస్తుందని చెప్పకపోవటం గమనార్హం. దానికి తోడు దేశంలోని పసుపు పండించే రైతులకు బోర్డుతో లాభం జరుగుతుందని చెప్పటం అనుమానాలకు తావిస్తోంది.
కార్యకర్తలతో సమావేశంలో ఎంపి ధర్మపురి అరవింద్ ప్రసంగించక పోవటం…ఆయన అనుచరులను మనస్తాపానికి గురిచేసింది. ప్రధాని ప్రసంగంలో కూడా ఎంపి అరవింద్ ప్రస్తావన రాలేదు. కనీసం పసుపు బోర్డు అంశం వచ్చినపుడు అయినా అరవింద్ గురించి చెపితే స్థానిక కమలం శ్రేణుల్లో కొంత ఉపు వచ్చేది.
ఒకప్పుడు గుజరాతీ బిడ్డ సర్దార్ వల్లాభాయి పటేల్ నిజాం నుంచి విముక్తి కల్పించాడని…ఇప్పుడు ఈ గుజరాతి బిడ్డ తెలంగాణ అభివృద్దిని సుస్థిరం చేస్తాడని మోడీ అనగానే సభలో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.
బిజెపి, బీ.ఆర్.ఎస్ ల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు రోజు జోరీగ మాదిరిగా ప్రచారం చేస్తున్నాయి. యుట్యూబ్ చానెల్స్, సోషల్ మీడియాలో దీనిపై వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. బీ.ఆర్.ఎస్ తమ ప్రత్యర్థి అని వివరించే యత్నం చేశారు. ఆ అంశంలో స్పష్టత ఇచ్చేందుకు ప్రధాని తాపత్రయ పడ్డట్టు కనిపించింది.
-దేశవేని భాస్కర్