What an ugly Telugu tiles, these days? రాజ రాజ నరేంద్రుడు ఎంతటి గొప్ప రాజో? తెలుగులో ఆది కవి అనుకుంటున్న నన్నయ్యను ఆయన ఎలా నెత్తిన పెట్టుకుని ఆదరించాడో?తెలుగు భాష, తెలుగు కళలకు రాజ రాజ నరేంద్రుడు ఎలా ఆయుస్సు పోశాడో? మనకనవసరం. రాజమహేంద్రవరం రాజధానిగా తూర్పు చాళుక్యుల పాలనలో రాజ రాజ నరేంద్రుడి పాలన అన్ని రంగాల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లిన చరిత్ర మనకనవసరం. తెలుగు మీద సంస్కృతం, కన్నడ ఆధిపత్యాలను తగ్గించి, తెలుగుదనం కోసం పరితపించి, తెలుగు ధనాన్ని మనకందించిన ఉత్తమ పాలకుడిగా రాజ రాజ నరేంద్రుడి ఆదర్శాలు మనకనవసరం.
దక్షిణాపథంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిన శ్రీకృష్ణ దేవరాయలు అయిదు వందల సంవత్సరాల కిందటివాడు. రాజ రాజ నరేంద్రుడు వెయ్యేళ్ల కిందటివాడు. ఇలాంటి రాజులు నలుగురు పుట్టబట్టి ఇప్పుడు ఈమాత్రమయినా తెలుగులో మనం అఘోరించగలుగుతున్నాం. లేకపోతే తెలుగు ఎప్పుడో మట్టికొట్టుకుని నామరూపాల్లేకుండా పోయి ఉండేది అన్న ఎరుక మనకనవసరం.
ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం.
“రాజ
రాజ
చోర”
ఇది ఒక సినిమా పేరు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక సాహితీ పిపాసి ఈ టైటిల్ మీద తీవ్రమయిన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా మరికొంతమంది గళం విప్పుతున్నారు. మంచిదే. ఈ టైటిల్ రాజ రాజ నరేంద్రుడిని కించపరిచేదిగా ఉందని వారి అభ్యంతరం. వారు అనవసరంగా భయపడుతున్నారు. లేదా బాధ పడుతున్నారు.
- రాజ రాజ నరేంద్రుడి గురించి ఈ సినిమా దర్శకుడికి తెలిసి ఉండే అవకాశమే లేదు.
- రాజ రాజ అన్న పునరుక్తిలో రాజులకే రాజు…రారాజు అని అర్థమొస్తుందని ఈ దర్శకుడికి భాషా జ్ఞానం ఉండే అవకాశమే లేదు.
- రాజ రాజ చోర అని టైటిల్ పెడితే రాజ రాజ నరేంద్రుడిని అవమానించినట్లు అని ఈ దర్శకుడికి ఇంగితం ఉండే అవకాశమే లేదు.
- సోషల్ మీడియాలో ఈ పేరు మీద వివాదం మొదలయినప్పుడయినా వివరణ ఇవ్వాలన్న సంస్కారం ఈ దర్శకుడికి ఉండే అవకాశమే లేదు.
- ఇంకా నయం. “రాజ రాజ నరేంద్ర చోర” అని టైటిల్ పెట్టనందుకు యావత్ తెలుగు జాతి ఈ దర్శకుడి కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవాలి.
పనిలో పనిగా
రాజ రాజ చోర”
సినిమా పక్కనే
క్రేజీ థియేటర్స్ లో రేపే విడుదల అయ్యే
“క్రేజీ అంకుల్స్”;
ఈ వారం అత్యుత్తమ సినిమా కాబోతోందని సగర్వంగా ప్రకటించుకున్న
“బ్రాందీ డైరీస్”
కూడా ఉన్నాయి. ఇంకో నాలుగు సినిమా టైటిల్స్ కూడా ఉన్నాయి కానీ-
చూసే ధైర్యం, చదివే సాహసం చేయలేక వదిలేశాను. నేనంటే పిరికివాడిని. మీరు చదవగలరు. చూడగలరు.
బ్రాందీ డైరీస్ రాసుకునే క్రేజీ అంకుల్స్ చేసిన రాజ రాజ చోర విద్యలు తెలుగు వెండి తెరపై నేడే బాగా చూడండి!
ఊరు పేరు లేని వాడిచ్చిన డాక్టరేట్ బిళ్ల మెడలో వేసుకుని…పేరు ముందు డాక్టర్ అని రాస్తే తప్ప పలకని మీకు రాజ రాజ నరేంద్రుడికి ఉన్న గౌరవ డాక్టరేట్లు ఎన్నో ఎలా తెలుస్తాయి? “గుళ్లో గుగ్గిలం వేయకపోయినా పరవాలేదు…మలినం చేయకుంటే చాలు”.
-పమిడికాల్వ మధుసూదన్