Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకాసుల వేటకు కళాత్మక నామకరణం

కాసుల వేటకు కళాత్మక నామకరణం

History Distortion in the name of fiction:
చింతపల్లి చింతచెట్టు కింద చింతపడుతున్న చిచ్చరపిడుగు అల్లూరి సీతారామరాజుకు ఒక ఉత్తరం వచ్చింది. అర్జంటుగా రైలెక్కి ఢిల్లీ వచ్చి బ్రిటీషు పోలీసు కొలువులో చేరాలన్నది ఆ ఉత్తరం సారాంశం. సమయానికి కుడి ఎడమల మల్లుదొర, ఘంటం దొరలు లేకపోవడంతో అల్లూరికి కాళ్లు చేతులు ఆడలేదు. దుర్మార్గులయిన తెల్లదొరల పాలననుండి భారతమాతను విముక్తి చేద్దామనుకుంటే…ఆ తెల్లదొరలే తనను ఉద్యోగానికి రమ్మనడంతో అల్లూరి ఆలోచనలో పడ్డాడు. వారి వేలితో వారికంటినే పొడవవచ్చు అనుకుని ఈ ఉద్యోగానికి వెళ్లాలని చింతపల్లి చింతచెట్టు సాక్షిగా ఎంతో చింతించి అల్లూరి నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే రావి చెట్టు తొర్రలో దాచిన గుడ్డ సంచిని తీసి, దులిపి…అందులో ఉన్న ప్యాంటు షర్టు వేసుకుని, టక్ చేసుకుని, బెల్టు పెట్టుకుని, దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషన్ కు బయలుదేరాడు. కాషాయం పంచె, చేతిలో విల్లమ్ములతో కనిపించే అల్లూరిని ఎవరయినా పోల్చుకోగలరు. బ్రిటీషు దొరబాబులా ఉన్న అల్లూరిని ఒక్కరు కూడా గుర్తు పట్టలేదు. రాజమండ్రి రైల్వే స్టేషన్లో అరటి ఆకులో ఉప్మా పెసరట్టు తిన్న అల్లూరికి ఎప్పుడు కునుకు పట్టిందో తెలియదు. లేచేసరికి ఢిల్లీ రైల్వే స్టేషన్ వచ్చింది.

అల్లూరి దగ్గర పెద్దగా లగేజ్ పెట్టెలు ఏమీ లేవు. ఒకే ఒక గుడ్డ సంచి. ప్లాట్ ఫామ్ మీద ఏదో హడావుడి. పోలీసుల బూట్ల చప్పుడు. ఈలోపు గుంపు మధ్యలో నుండి రూథర్ ఫర్డ్ జగ్గయ్య దగ్గుతూ ముందుకొచ్చాడు. వెల్ కమ్ అల్లూరి…ఢిల్లీ నగర పోలీసు కమిషనర్ గా నిన్ను నియమించి…నేను రుషీకేష్ లో తపస్సు చేసుకోవడానికి వెళ్లాలి…అని సాదరంగా అల్లూరిని మోటార్ కార్ లో ఎక్కించుకుని వెళ్లాడు.

అల్లూరికి అంతా అయోమయంగా ఉంది. అయినా తన వ్యూహం తనకుంది. బొడ్లో దాచుకున్న పిస్టల్ ను ఒకసారి తృప్తిగా తడిమి చూసుకున్నాడు.

ఈలోపు ఆదిలాబాద్ అడవులనుండి వచ్చిన ఐ ఎఫ్ ఎస్ అధికారి ఢిల్లీలో తప్పిపోయాడు అని వార్త దావానంలా రాజుకుంది. ఢిల్లీ పోలీసు కమిషనర్ గా అల్లూరి నైట్ డ్యూటీకి వెళితే కన్నాట్ ప్లేస్ ఫుట్ పాత్ మీద ఒకతను అనుమానాస్పదంగా కనిపించాడు. అతని కళ్లు- అల్లూరి కళ్లు మౌన భాషలో ఏదో మాట్లాడుకున్నాయి. అంతే కోటి మెగావాట్ల విద్యుత్ తో కన్నాట్ ప్లేస్ వెలిగిపోయింది. అతను ఆదిలాబాద్ ఉద్యమ వీరుడు. మనవాడు మన్నెం వీరుడు. ఆ క్షణం కోసమే చరిత్ర నిరీక్షిస్తోంది.

రూథర్ ఫర్డ్ జగ్గయ్య గుండు కొట్టించుకొని, కాషాయ వస్త్రాలు తొడుక్కుని పాదయాత్రగా రుషీకేష్ బయలుదేరాడు. ఇక్కడ అల్లూరి- ఆదిలాబాద్ వీరులిద్దరూ యుద్ధభూమికి పునాదులు తవ్వుతున్నారు.

వారిద్దరి కలయిక- రెండు సూర్యుల షేక్ హ్యాండ్.
వారిద్దరి అడుగులు- బ్రిటిషువారి నెత్తిన పిడుగులు.
వారిద్దరి ధైర్యం- ధైర్యానికే ధైర్యం.
వారిద్దరి సిక్స్ ప్యాక్- దేశానికి ఎయిట్ ప్యాక్.
వారి అరుపు- సింహాలకు వణుకు.
వారి మాట- మర ఫిరంగి తూటా.
వారి బాట- కట్టని కోట.

రుషీకేష్ చేరకముందే రూథర్ ఫర్డ్ కు డి వి వి దానయ్య సినిమా కనపడింది. వెంటనే కాషాయం వదిలి వెనక్కు వచ్చేశాడు. కానీ…అప్పటికే ఆలస్యం అయిపోయింది. అల్లూరి- ఆదిలాబాద్ వీరులు దేశానికి స్వాతంత్య్రం ఇచ్చేసి…ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం ఎగురవేసి…ఏమీ ఎరగనట్లు…తిరిగి ఎవరి ఊళ్లకు వాళ్లు వచ్చేశారు.

కథ సమాప్తం.

ఇది జరిగిన కథ కాదు. కేవలం కల్పితం. తెలుగు సినిమా కోసం ఒక ఔత్సాహిక కథా రచయిత ఎప్పుడో రాసి పెట్టుకున్న కథ, మాటలు, స్క్రీన్ ప్లే బౌండ్ బుక్. కొంచెం క్రియేటివ్ లిబర్టీ ఎక్కువయిందని చాలామంది నిర్మాతలు ఈ కథను తిరస్కరించారు. ఇప్పుడు ఇలాంటిదేదో RRR సినిమాగా వస్తుండడంతో ఈ కథ దుమ్ము దులిపి రచయిత ఫిలిం నగర్ వీధుల్లో తిరుగుతున్నాడు. ఎక్కడి అల్లూరి? ఎక్కడి కొమురం భీమ్? ఎవరు ఏ కాలంలో పుట్టారు? ఒకరున్నప్పుడు ఒకరు పుట్టకుండానే ఎలా కలుసుకున్నారు? అని మన రచయితను ఇప్పుడు ఫిలిం నగర్ వీధులు అడగలేకపోయాయి. అడిగే అధికారం కోల్పోయాయి.

క్రియేటివ్ లిబర్టీ ముందు చరిత్ర దూది పింజ.
క్రియేటివ్ లిబర్టీ ముందు నిజం పంజరంలో స్వేచ్ఛ లేని చిలుక.
క్రియేటివ్ లిబర్టీ దానికదిగా ఒక బాధ్యతలేని భావప్రకటన.
క్రియేటివ్ లిబర్టీ కాసుల వేటకు ఒక కళాత్మక నామకరణం.

(అల్లూరి, కొమురం భీమ్ లకు శిరస్సు వంచి క్షమాపణలతో)

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : క‌న్నుల పండుగ‌లా ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ పాట

RELATED ARTICLES

Most Popular

న్యూస్