రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ప్రాజెక్టుల్లోకి ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా కేంద్రంలో ఉట్నూర్ – ఆదిలాబాద్ మధ్య రోడ్డుపై నీరు ప్రవహిస్తున్నది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. సాత్నాల, మత్తడి ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని అధికారులు బయటకు వదులుతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా జిల్లాలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంజీర నది ఎగువతో పాటు పరీవాహక ప్రాంతాల్లో వర్షాలకు నదిలోకి వరద తరలివస్తున్నది. మోర్గీ వంతెన వద్ద మంజీర నది ఉరకలేస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వర్షం దంచికొడుతున్నది. వానకు పలిమెల మండలం జలదిగ్బంధంలో చిక్కుకున్నది. పెద్దపేట వంతెన కొట్టుకుపోయి మహదేవ్‌పూర్ – పలిమెల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
దీంతో ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. విద్యుత్ సరఫరా లేక అవస్థలకు గురవుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం ఇల్లెందులో వర్షాలకు సింగరేణి ఏరియాలోని ఓపెన్‌కాస్ట్‌లో వరద నీరు చేరింది. దీంతో ఉత్పత్తికి ఆటంకం కలుగుతున్నది. ఇల్లెందు పదో గనిలో 10వేల టన్నుల ఒగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతున్నది. టేకులపల్లి కోయగూడెం ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. 40వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీసే పనులకు అంతరాయం కలుగుతున్నది.
శ్రీరాంసాగర్ మరో ఆరుగేట్ల ఎత్తివేత
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 81,730 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ఇప్పటికే 20గేట్ల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు తాజాగా.. మరో ఆరుగేట్ల ఎత్తివేశారు. ప్రస్తుతం 26 గేట్లను ఎత్తి దిగువకు 1,07,118 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1087.50 అడుగుల మేర నీరున్నది. డ్యామ్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 90.30 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 74.826 టీఎంసీలు నిలువ ఉన్నది.
నిండుకుండలా హుస్సేన్ సాగర్
ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌కు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. కూకట్‌పల్లి నాలా నుంచి వస్తున్న నీరు సైతం హుస్సేన్‌సాగర్‌లోకి చేరుతోంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుతం పూర్తి స్థాయికి చేరుకుంది. వస్తున్న నీటి ఇన్‌ఫ్లోకు… సమానంగా తూముల ద్వారా నీరు బయటకు వెళుతోంది.