మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏదీ లేదని మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాల్లో ఉండబోనని గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని చెప్పారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాకినాడ వచ్చిన రాజగోపాల్ మార్గమధ్యంలో రాజమండ్రిలో మాజీ ఎంపిలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్ లతో భేటీ అయ్యారు. హర్ష కుమార్ నివాసంలో మీడియాతో లగడపాటి మాట్లాడారు.
హర్షకుమార్, ఉండవల్లి అంటే తనకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన అభిమానం ఉందని, తాను ఏ పార్టీలో లేకపోయినా వారిద్దరూ ఎన్నికల్లో పోటీ చేస్తే వారికి అనుకూలంగా… అది ఏ పార్టీ అయినా సరే ప్రచారం చేస్తానని వెల్లడించారు. ఏపీలో ఒకప్పుడు జాతీయ పార్టీకి- ప్రాంతీయ పార్టీలకు మధ్య పోటీ ఉండేదని, ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ నెలకొని ఉందని వ్యాఖ్యానించారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణలో ఆ పార్టీ విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ఆ పార్టీని విభజన సమయంలో వ్యతిరేకించాల్సి వచ్చిందని తమ మనస్సులో ఆ పార్టీ ఎప్పుడూ ఉంటుందన్నారు. జాతీయ పార్టీలు బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తినని వివరించారు.
లగడపాటి రాజగోపాల్ విజయవాడ, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గాలనుంచి ఏదో ఒక చోట తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీ చేయవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో ఈ విషయమై నేడు క్లారిటీ ఇచ్చారు. కేశినేని నానికి టిడిపి టికెట్ నిరాకరించింది. గల్లా జయదేవ్ రాజకీయాల్లో కొనసాగేందుకు విముఖత ప్రదర్శిస్తున్నారు. అందుకే ఈ రెంటిలో ఏదో ఒక స్థానం నుంచి లగడపాటిని దింపాలని టిడిపి ఆలోచిస్తున్నట్లు కొద్దికాలంగా వార్తలు వస్తున్నాయి.