Saturday, March 14, 2026
HomeసినిమాNational Awards: 'బన్నీ' ని చూస్తే గర్వంగా ఉంది: త్రివిక్రమ్

National Awards: ‘బన్నీ’ ని చూస్తే గర్వంగా ఉంది: త్రివిక్రమ్

అల్లు అర్జున్  జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపిక కావడంతో పాటు ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఆరు అవార్డులు కైవసం చేసుకోవడంపై దర్శకుడి త్రివిక్రమ్ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.

“అల్లు అర్జున్ గారు సాధించిన ఈ అద్భుతమైన విజయం నాకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఆయన జాతీయ అవార్డును కైవసం చేసుకోవడంతో పాటు, ఈ ఘనత సాధించిన మొదటి తెలుగు నటుడిగా నిలవడం గర్వంగా ఉంది. అల్లు అర్జున్ గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా.. పాత్రలకు ప్రాణం పోయడం పట్ల ఆయన చూపే శ్రద్ధాసక్తులు, అసమానమైన అంకితభావం, అభిరుచి స్పష్టంగా తెలుసు. అతని అసాధారణమైన ప్రతిభను, నిబద్ధతను గుర్తించే మరిన్ని పురస్కారాలతో అలంకరించబడిన భవిష్యత్తు దగ్గర్లోనే ఉంద”ని త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు.

“కమర్షియల్ సినిమా పాటలకు కొత్త అర్థం చెప్పిన దిగ్గజ స్వరకర్త ఎం.ఎం. కీరవాణి గారు ఆర్ఆర్ఆర్ వంటి స్మారక చిత్రానికి గానూ ఒకే ఏడాది అటు ఆస్కార్, ఇటు జాతీయ పురస్కారం గెలుచుకోవడం అభినందించదగ్గ విషయం. వెండితెర పై ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచిన దృశ్యకావ్యం ఆర్ఆర్ఆర్ కి పని చేసిన ప్రతి సాంకేతిక నిపుణుడుకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలియచేశారు. జాతీయ అవార్డు పొందిన కాల భైరవ, శ్రీనివాస్ మోహన్, ప్రేమ్ రక్షిత్, కింగ్ సోలమన్‌ లకు అభినందనలు” తెలిపారు.

“ముఖ్యంగా మన తెలుగు సినిమా కీర్తిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ఎస్.ఎస్. రాజమౌళి గారికి ధన్యవాదాలు. తమ తొలి చిత్రం ఉప్పెనతో జాతీయ అవార్డును గెలుచుకున్న బుచ్చిబాబు సన మరియు పంజా వైష్ణవ్ తేజ్‌లకు నా శుభాకాంక్షలు. అలాగే, నేను ఎంతగానో అభిమానించే, గౌరవించే గీత రచయిత చంద్రబోస్ గారు కొండపొలం సినిమాకు గాను జాతీయ అవార్డు అందుకున్నందుకు నా శుభాకాంక్షలు. నా సోదరుడు, ఉత్సాహవంతమైన స్వరకర్త దేవిశ్రీ ప్రసాద్ జాతీయ అవార్డును గెలుచుకోవడంతో నా హృదయం సంతోషంతో నిండిన క్షణం. అతను మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను. మన తెలుగు చిత్ర విజేతలందరితో పాటు, 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు” అంటూ స్పందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular